త్వరలో జనసేన పార్లమెంటరీ కమిటీలు

Janasena
Janasena

వీరికే ఎమ్మెల్యే, ఎంపిగా పోటీ అవకాశం
వారం లోపులోనే నియామకాలు
తదుపరి అసెంబ్లీ, బూత్‌ స్థాయి
సమీకరణల పనిలో నిమగ్నం
పోటీ పడుతున్న ఆశావహులు
హైదరాబాద్‌: జనసేన పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఆ పార్టీలో ప్రస్తుతం ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ ఆ పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ చర్యలు చేపట్టారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో తాత్కాలికంగా పార్లమెంటరీ కమిటీలను వేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీకి జిల్లాలకు కన్వీనరు, జాయింట్‌ కన్వీనర్లు ఉన్నారు. వీరితో పార్టీ వ్యవహారాలన్నీ ముందుకు సాగడం లేదనే ఉద్దేశ్యంతో పవన్‌కల్యాణ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని జిల్లాల్లో కన్వీనర్లు, కో కన్వీనర్లు పార్టీ సిద్ధాంతాలు, నియమావళి, మేనిఫేస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలం అయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పదవులకే ప్రాధాన్యతను ఇస్తూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పెట్టి ఐదేళ్లయినా ఇంత వరకూ జనసేన పార్టీకి జిల్లాల్లో కన్వీనర్లు, కో కన్వీనర్లు తప్ప ఒక్క కమిటీని కూడా వేయ లేదు. పార్టీ నిర్మాణం అనే ప్రస్తావన లేదని వస్తున్న విమర్శలకు పవన్‌కల్యాన్‌ ఇటీవల స్పందించారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాల వల్లే తాను పార్టీ కమిటీలు వేయలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీలో పదవులు పొందిన నేతలు ఇతర పార్టీలకు వెళ్లిపోవడంతో ఆ పొరపాటు జనసేనలో జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్న పవన్‌కల్యాణ్‌ కమిటీల గూర్చి అసలు ప్రస్తావనే తీసుకురావడం లేదని కార్యకర్తలు అంటున్నారు. ఈనేపథ్యంలో కన్వీనర్లు, కో కన్వీనర్లు ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయ లేదనేది పార్టీ వర్గాల భావన. ప్రధానంగా ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా జిల్లాల వారీగా కాకుండా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని పవన్‌కల్యాణ్‌ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నింటిలో 25 కమిటీలను వేయాలని దాదాపు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ కమిటీలో 25 మందికి స్థానం కల్పించాలని ప్రణాళిక బద్దంగా ఆలోచన చేస్తున్నారు. ఇందులో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇద్దరు సభ్యులను పార్లమెంట్‌ కమిటీలో చోటు కల్పించాలని భావిస్తున్నారు. ఈ కమిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని పవన్‌కల్యాణ్‌ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో జనసేన పార్టీకి పార్లమెంట్‌ స్థాయి కమిటీల ఎంపిక కీలకంగా మారనుందనే అభిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి సంక్రాంతి ముందే పార్లమెంటరీ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని భావిచారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి కానందున వాటిని ప్రకటించ లేకపోయారు. కమిటీల్లో స్థానం కోసం ఆశావహులు అనేక మంది పోటీ పడుతుండడంతో అసంతృప్తి వాదుల బెడద లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ కమిటీలపై లోతైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సామాజిక సమీకరణలతోపాటు, మహిళలకు, యవతకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఏర్పాటు జరుగుతున్నాయి. అలాగే సమర్థత, పేరు ప్రతిష్టలు వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుని, సమీకరణలను చూసుకోవాల్సి ఉందనే ఉద్దేశ్యంతో నియోజకవర్గాల స్థాయి కమిటీల నియామకం విషయంలో ఇప్పటి వరకూ జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ లెక్కలన్నింటినీ సరిచూసుకుని ఈ నెలాఖరులోగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ కమిటీల్లో సభ్యత్వం కీలకంగా మారడంతో ఆశవాహులు కమిటీల్లో స్థానం సంపాదించడం కోసం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలియవచ్చింది. పార్లమెంటరీ స్థాయి కమిటీల్లో చోటు దక్కిన వారికే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుల సంఖ్య పాతిక వరకూ ఉండేటట్టు ప్రచారం జరుగుతుండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి, రెండు నియోజక వర్గాలు మినహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఇద్దేరేసి పేర్లకు తగ్గకుండా ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరికి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అందరి దృష్టీ పార్లమెంటరీ కమిటీలపై పడింది. మరోపక్క పార్లమెంట్‌ స్థాయి కమిటీలు పూర్తయితే ఇదే తరహాలో అసెంబ్లీ స్థాయి కమిటీలను సైతం వేయాలని పవన్‌కల్యాణ్‌ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్నికల నాటికి ఈవిధంగా బూత్‌ స్థాయిలో కమిటీలు వేసుకుని పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలని జనసేన పార్టీ చీఫ్‌ వపన్‌కల్యాణ్‌ ఆశిస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినందున పొత్తులు లేకపోవడంతో తమ అదృష్టాని నపరీక్షించుకునేందుకు ఆశవహులు క్యూ కడుతున్నారు.