తెలంగాణ వ్యవసాయ శాఖకు ఇండియా టుడే అగ్రి అవార్డు

AGriculture
AGriculture

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖకు ప్రతిష్టాత్మకమైన ఇండియా టు డే అగ్రి అవార్డు లభించింది. ఈనెల 23వ తేదీన ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ ఈ అవార్డును బహుకరించనున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రాధాన్యత దక్కినట్లయ్యింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం స్పందిస్తూ ఇది ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్రం ఏర్పడి కేవలం నాలుగేళ్లు అయినా, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ, రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు, తీసుకున్న చర్యలు గత 70 ఏళ్లుగా ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికి దిక్చూచిగా మారిందనడానికి ఈ అవార్డు ఒక ఉదాహరణ అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వేస్తున్న ప్రతీ అడుగు రైతుల మేలు కోసమేనని వ్యాఖ్యానించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌, పంట పెట్టుబడిగా ఎకరానికి రెండు పంటలకు 8 వేల రూపాయలు ఇచ్చే రైతు బంధు పథకం, 1.50 లక్షల కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రతీ రైతుకు 5 లక్షల రూపాయల బీమా, సబ్సిడీతో యంత్ర పరికరాల పంపిణీ, సూక్ష్మ బిందు సేద్యానికి అధిక నిధులు, ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి అమలు చేస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో దండగన్న వ్యవసాయం పండుగ అయ్యిందని చెప్పారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించిందని వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి మార్గదర్శకంలో మరింతగా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.