తెలంగాణకు కేంద్రం నుంచి రూ.450 కోట్ల నిధులు

FUNDS
FUNDS

హైదరాబాద్‌ :ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఇదే సమయంలో తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం గత ఆరు నెలలుగా నిధులు విడుదల చేయలేదు. తెలంగాణలోని 9,ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాలకు వెనుకబడిన జిల్లాల కింద నిధులు రావాలి. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రావాల్సి ఉంది. ఆరు నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలకు నిధులు రావాల్సి ఉంది. కానీ రాలేదు. సిఎం కెసిఆర్‌ ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసి నిదులు విడుదల చేయాలని కోరారు. సిఎం విజ్ఞప్తి మేరకు 2018-19 సంవత్సరానికి సంబంధించిన నిధులను ఆర్థిక శాఖ సోమవారంనాడు విడుదల చేసింది.అయితే, ఆంధ్రప్రదేశ్‌కు విడుదల కాకపోవడం చర్చనీయాంశ మైంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది మార్చి నెలలో ఏపిలోని ఏడు జిల్లాలకు విడుదల చేసిన రూ.350 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే వెనక్కు తీసుకుంది.అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణంగా వీటిని వెనక్కి తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం యూసీలు,ఖర్చుల వివరాలు కేంద్రానికి పంపించింది.యూసీలు,ఖర్చులు సమర్పించి నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఏపీకి నిదులు రాలేదు. వాస్తవంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు తెలంగాణలోను నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగా ణకు చెందిన 9 జిల్లా లకు గాను రూ.450 కోట్ల నిధులు తాజాగా విడుదల చేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు ఉత్తర్వు లు జారీ చేశారు.ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదని చెప్పారు. ఏపీ యూసీలు ఆలస్యంగా ఇచ్చినందువల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనుకబడిన జిల్లాలకుగాను ఏటా తెలంగా ణకు రూ.450 కోట్లు, ఏపీకి రూ.350 కోట్లు చెల్లిస్తోన్న కేంద్రం నుంచి ఈ ఏడాదికిగాను ఏపికి మాత్రం రావాల్సి ఉంది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలోని పాత తొమ్మిది జిల్లాలకు నిధులు వస్తున్నాయి.కాగా,ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు ఇవ్వకపోవడంపై ఆ రాష్ట్ర నేతలు కేంద్రాన్ని తప్పుపట్టారు.