తీరం దాటిన తిత్లీ బీభత్సం

 

 

titli
titli

వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లాలో ఖతితలీగ తుఫాను తీరం దాటింది. వజ్రపుకొత్తూరు మండలం తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను తీరం దాటిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై వాతావరణ శాఖ ముందే రెడ్ మెసేజ్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున రెండు గంటల సమయం వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు పల్లెసారథి వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఆ తరువాత మెల్లగా తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు తలదాచుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 53 కిలోమీటర్ల మేర తుఫాను కేంద్రం విస్తరించి ఉంది.
బుధవారం రాత్రి నుంచే ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురవడం మొదలయ్యాయి. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాలో, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది.
ముందుకు వచ్చిన సముద్రం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు కవిటి మండలం కొత్తపాలెం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని డి మరువాడ ప్రాంతంలో సముంద్రం ముందుకు వచ్చింది. ఇసుక దిబ్బలు కోతకు గురయ్యాయి. హుద్‌హుద్ తర్వాత ఈ స్థాయిలో గాలులు వీయడం ఇప్పుడే చూస్తున్నామని మత్స్యకారులు తెలిపారు.
తూర్పునావికా దళం సిద్ధం
తితలీ తాకిడికి దెబ్బతినే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి తూర్పునావికా దళం సిద్ధమైంది. ఒడిశాతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నష్టం జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన తూర్పు నావికాదళం ముందస్తు ఏర్పాట్లు చేసింది.