తిత్లీ తుఫాన్‌ ఉగ్రరూపం

Titly
Titly

తిత్లీ తుఫాన్‌ ఉగ్రరూపం

గంటకు 110-130 కి.మీ వేగంతో గాలులు
రెండు జిల్లాల్లో 11 మంది మృత్యువాత
వణికిన తీరప్రాంత వాసులు , అప్రమత్తమైన అధికారులు

విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన తితిలీ తుఫాన్‌ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది.దీని ప్రభావం శ్రీకాకుళంజిల్లా ్లపై ఎక్కువ ప్రభావం పడగా విజయనగరం జిల్లాలో కూడా ఒకింత ప్రభావం చూపించింది. ఈ తుఫాన్‌ వల్ల వీచిన గాలులకు శ్రీకాకుళం జిల్లాలో 8 మంది మృత్యువాత పడగా, విజయనగరం జిల్లాలో ముగ్గురుని పొట్టన పెట్టుకున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్‌ గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పరిధిలోని వజ్రపు కొత్తూరు మండలంలో తీరం దాటింది. దీంతో వీచిన పెనుగాలుల వల్ల జిల్లా దాదాపుగా అతలాకుతలం అయ్యందనేచెప్పాలి, గురువారం ఉదయం నుంచి భారీ వర్షం,పెనుగాలుల వల్ల జిల్లా వ్యాప్తంగాచెట్టు కూలడంతో పాటు ఇల్ల పైకప్పులు సైతం ఎగిరిపోయి తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

ఉద్దానం తో పాటు పలాస, టెక్కలి ప్రాంతాల్లో తుపాన్‌ భీభత్సం సృష్టించింది. ఈ గాలులకు ప్రజలు భీతిల్లిపోయారు. మరోసారి హుద్‌ హుద్‌ గాలులు గుర్తుకువచ్చాయని బాధితులు చెబుతున్నారు. ప్రధానంగా సోంపేట, కవిటి, ఇచ్చాపురం, వజ్రపుకొత్తూరు, భావనపాడు, ఉమిలాడ, మన్నాపల్లి తదితర తీర గ్రామాల్లో ప్రజలు , మత్స్యకారులు విలవిల్లాడిపోయారు. జిల్లా లోని కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, లావేరు, రణ స్థలం, పాతపట్నం, నరసన్నపేట, పోలాకి, గార, తదితర ప్రాంతాల్లో ప్రజా జీవనానికి తీరని నష్టం కలిగింది.

తుఫాన్‌ కారణంగా వీచిన గాలులు ప్రజలు భయాందోళనలుకు గురి చేశాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమని గడిపారు.గాలులు, తీవ్ర వర్షానికి పలువురు మరణించడంతో పాటు మరి కొంత మంది మత్స్యకారులు గల్లంతయారని భోగట్టా. తుపాన్‌ కారణంగా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. విద్యుత్‌ స్థంభాలు కూలిన కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రధానంగా జిల్లాలోని అధిక భాగం కొబ్బరి, జీడి మామిడి పంటలకు తీరని నష్టం జరిగినట్లు అదికారులు అంచనావేస్తున్నారు. సుమారు నాలుగు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసి పడ్డాయని మత్స్యకారులు చెబుతున్నారు.

మరణాల సంఖ్య పెరగకుండా అధికారులు చురుకుగా పనిచేస్తున్నారు. జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇప్పటికే శ్రీకాకులం జిల్లాలోని పలు ప్రాంతాలనుపర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేందాన్న్రి ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి కళావెంకటరావు కూడా అధికారులతో సమీక్ష చేశారు. విద్యుత్‌ సరఫరా త్వరిత గతిన పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయనసూచించారు. మృతులు వివరాలు ఇవి : తితిలీ సృష్టించిన భీభత్సం కారణంగా మరణించిన వారి వివరాలను అదికారులు ఎట్టకేలకు నిర్ధారించారు. వీరిలో సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన ముడిదాల సూర్యారావు (46), వంగర మండలం వోనె అగ్రహారం కు చెందిన తాడి అప్పలనరసమ్మ (62), సంతబొమ్మాలి మండలం సున్నపల్లికి చెందిన బొంగు దుర్గారావు (50),వడ్డితాండ్రకు చెందిన అప్పలస్వామి (56), టెక్కలి కిచెందిన కొల్లి లక్ష్మణ (70), మందస మండలం సువర్ణపురం కు చెందిన మన్నేన సంతోష్‌కుమార్‌ (29), ఇప్పిలి కన్నయ్య (53) ఉన్నారు. అలాగే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తమ్మయ్యపాలెం కు చెందిన బడి సత్తిబాబు (28), బర్లిపేట గ్రామానికి చెందిన సూరాడ రామ (20), వాసుపల్లి లక్ష్మణరావు (35) ఉన్నారు.