డివిలియ‌ర్స్ రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌

AB DIVILLIERS
AB DIVILLIERS

ప్రిటోరియాః ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న అబ్రహం బెంజిమిన్ డివిలీయర్స్ ప్రస్థానం ముగిసింది. తన 14 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నానని బుధవారం సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఏబీ ప్రకటించాడు. తన నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి 420 మ్యాచ్‌లాడిన 34 ఏండ్ల ఏబీ..విరామం లేని అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తువ(ఔట్ ఆఫ్ గ్యాస్) లేదంటూ దేశవాళీకే పరిమితమవుతానని అన్నాడు. తన నిర్ణయాన్ని ట్విట్టర్ వీడియో ద్వారా అందరితో పంచుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 114 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడిన నేను వైదొలుగాలన్న నిర్ణయానికి వచ్చాను. నిజాయితీగా చెబుతున్నాను, చాలా అలిసిపోయాను. వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. ఒక విధంగా కఠిన నిర్ణయమైనా..ప్రతిభ కల్గిన యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశం కూడా ఇందులో దాగి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫార్మాట్‌ను ఎంచుకుని ఆడే ఓపిక లేదు.
ఇన్నేండ్లు నాకు మద్దతుగా నిలిచిన క్రికెట్ దక్షిణాఫ్రికా(సీఎస్‌ఏ)కు, సహచర ఆటగాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇన్నాళ్లు నా పట్ల మీరు చూపించిన అభిమానానికి సర్వదా రుణపడి ఉంటాను అని ఏబీ అన్నాడు. మరోవైపు సీఎస్‌ఏ అధ్యక్షుడు క్రిస్ నెంజానీ స్పందిస్తూ దక్షిణాఫ్రికా ఆల్‌టైమ్ క్రికెట్ దిగ్గజాలలో ఏబీ ఒకడు. తన వైవిధ్యమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించిన ఆటగాడు అతను. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించడంలో తనకు తానే సాటి అని నిరూపిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ అతన్ని ఎంతగానో కోల్పోతున్నది అని నెంజానీ అన్నాడు. ఐపీఎల్‌కు దూరం! విదేశాల్లో ఆడే అలోచనైతే ప్రస్తుతానికి లేదు. దేశవాళీ టోర్నీలో టైటాన్స్ జట్టుతో కలిసి కొనసాగుతానన్న నమ్మకముంది అని ఏబీ అన్నాడు. ఇలా చూస్తే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో బెంగళూరు తరఫున ఏబీ ఆడే అవకాశాలు అంతగా కనిపించడం లేదు.