డిజిల్‌ ధర పెంపుతో ఆర్టీసీకి రూ.600 కోట్ల భారం!

tsrtc busses
tsrtc busses

రూ.1 ధర పెరిగితే..రోజుకు 18 కోట్లకు పైగా అదనపు ఖర్చు!!
హైదరాబాద్‌: ‘మూలిగే నక్కపై..తాటికాయ పడ్డట్లు..గా మారింది తెలంగాణ ఆర్టీసీపై పరిస్థితి. ఇప్పటికే పీకల్లోతు నష్టాలలో ఉన్న ఆర్టీసీకి ఇటీవల కాలంగా వరుసగా విపరీతంగా పెరుగుతోన్న డిజిల్‌ ధరలు పెనుభారంగా మారాయి. ప్రధానంగా గత సంవత్సరం కాలంగా పెరుగుతున్న డిజిల్‌ ధర వల్ల సంస్థపై ఇప్పటికే రూ.600 కోట్ల భారం పడిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా డిజిల్‌ ధర రూ.1 పెరిగితే రోజుకు సంస్థపై కనిష్టంగా రూ.18 కోట్ల నుంచి గరిష్టంగా రూ.20 కోట్ల వరకు అదనపు ఖర్చు పడుతుందని వారు గణాంకాలు వివరించారు. తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం 97 డిపోల పరిధిలోని 8400 బస్సులు..3000 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు కోటి మంది వరకు ప్రయాణీకుల రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయు. ముఖ్యంగా గత నెలరోజులుగా వరుసగా పెరుగుతున్న డిజిల్‌ ధర వల్ల టిఎస్‌ ఆర్టీసీపై మోయలేని భారం పడుతోందని..పరిస్థితి ఇలాగే ఉంటే సంస్థను నిర్వహించడం చాలా కష్టంగా మారనుందని సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ఆర్టీసీ ప్రతిరోజు బస్సులు 36 లక్షల కిలోమీటర్ల పాటు తిరుగుతున్నాయి. ఇందుకోసం రోజుకు 7 లక్షల డిజిల్‌ను వాడుతున్నారు. ఇంత పెద్దమొత్తంలో డిజిల్‌ వాడుతున్నందున ఒక్క రూపాయి డిజిల్‌ ధర పెరిగిన కోట్ల రూపాయల్లో సంస్థపై భారం పడుతుందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ నష్టాన్ని ఆర్టీసీ భరించే స్థితిలోలేదని..అందువలన ప్రయాణీకులపై టికెట్ల ధరలు పెంచి..భారమైన మోపాలి..లేదంటే ప్రభుత్వం నేరుగా ఈ పెరుగుదల నష్టాన్ని చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. డిజిల్‌ ధరల పెంపుతో కార్మికులకు ఎలాంటి సంబంధం లేదని..సంస్థ ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు మూడు వేల కోట్ల అప్పులలో పీకల్లోపు కూరుకుపోయిన టిఎస్‌ ఆర్టీసీని గత ఏడాదిగా పెరుగుతోన్న డిజిల్‌ ధరలు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయనటంలో ఎలాంటి అనుమానం లేదనే వాదలు సర్వత్రా వినిస్తున్నాయి.