ట్రిపుల్‌ తలాక్‌కు మూడేళ్ల జైలు, జరిమానా

TTALAK
TTALAK

ట్రిపుల్‌ తలాక్‌కు మూడేళ్ల జైలు, జరిమానా

ముసాయిదా చట్టం రెడీ
శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు బిల్లు

న్యూఢిల్లీ: ఇకపైముస్లిం కులాల్లో విడాకులు తీసుకునే సమయంలో ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా తీసుకుంటే వెనువెంటనే మూడేళ్ల జైలు శిక్ష పడేవిధంగా ముసాయిదా చట్టాన్ని కేంద్రం రూపొందిస్తున్నది. పార్లమెంటు శీతాకాల సమా వేశాల్లోనే ఈబిల్లును ప్రవేశపెడుతోంది. ముస్లిం మతస్తుల్లో ఇప్పటివకూ ట్రిపుల్‌ తలాఖ్‌, లేదా తలాక్‌ ఇ బిద్దత్‌ అమలులో ఉంది. ఒక వ్యక్తి తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌తో అప్పటికప్పుడు విడాకులు పొందాలనుకుంటే అది ఎంతమాత్రం సాధ్యపడదు.

ఇమెయిల్‌ పంపించడం, లేక మౌఖికంగా చెప్పడ, లిఖితపూర్వకంగా చెప్పినా ఇకపైమూడేళ్లపాటు జైలుశిక్ష,జరిమానా పడుతుందని ముసాయిదా చట్టం చెపుతోంది. ఈ నేరాలను నాన్‌బెయిలబుల్‌ కేసులుగా పరిగణిస్తారు. ముస్లిం పర్సనల్‌ లా కింద ట్రిపుల్‌ తలాక్‌ వ్యవస్థను అమలుచేస్తున్నారు. ముస్లింపెద్దల సమక్షంలో భర్త మూడుసార్లు తలాక్‌ అని చెపితే చాలు విడాకులు తీసుకున్నట్లేనని భావించేవారు. సుప్రీం కోర్టువరకూ వెళ్లిన ఈ తాజా కేసును ఐదుగురు సభ్యులున్న బెంచ్‌ విచారణ చేస్తోంది. ట్రిపుల్‌ తలాక్‌ చట్టసమ్మతం కాదని, అక్రమవిధానమని తేల్చిచెప్పింది. ఐదుగురిలో ముగ్గురు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.

మరో ఇద్దరుమార్పులు తీసుకురావాలని గత ఆగస్టు 22వ తేదీ తీర్పు వెలువరించారు. తీర్పుదరిమిలా కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ముస్లిం లాకు ముసాయిదా చట్టంజోడించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తీసుకువచ్చేందుకు కృషిచేస్తోంది. తలాక్‌ ఇబిద్దత్‌ కింద అప్పటికప్పుడు ట్రిపుల్‌ తలాక్‌ అని చెపితే బాధితురాలు పోలీసు స్టేషన్‌కుసైతం వెళ్లేందుకు వీలులేదు.

అలాగే ముస్లిం మతాచారాలప్రకారం ఆమెకు ఎటువంటి సాయం అందబోదు. భర్తపై పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు ఈ ముస్లిం చట్టాలు చెపుతున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌చట్టానికి బ్రేకులు వేసే విధంగా సుప్రీం కోర్టు గత ఆగస్టులో ఇచ్చిన తీర్పుద్వారా ముసాయిదా చట్టానికి రూపకల్పన జరుగుతోంది. తీర్పు వెలువడిన తర్వాత కూడా ట్రిపుల్‌ తలాక్‌ పేరిట లెక్కకుమించిన కేసులు నమోదయ్యాయి. మతపెద్దలకు అనేక పర్యాయాలు సర్క్యులర్లు పంపించినప్పటికీ ట్రిపుల్‌ తలాక్‌ కేసుల్లో ఎటువంటి తగ్గింపులేదని, ఈ విధానం కట్టడిచేయాల్సిన అవసరం ఉందని ముస్లిం మహిళలకు అవగాహనచైతన్యం పెంపొందించాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవలే జరిగిన ఒక ట్రిపుల్‌ తలాక్‌లో ఒక ప్రముఖ విద్యాసంస్థలో పనిచేస్తున్న వ్యక్తి తన భార్యకు వాట్సాప్‌ ఎస్‌ఎంఎస్‌ద్వారా తలాక్‌ పంపించి విడాకులు తీసుకున్నట్లు తేలింది. ఇలాంటి కేసులు ఇప్పటికీ వస్తున్నట్లు ఒక మతపెద్ద వివరించినట్లు కేంద్రానికి సైతం సమాచారం అందింది. అందువల్లనే ట్రిపుల్‌ తలాక్‌కు చెక్‌పెట్టేందుకుగాను కొత్త ముసాయిదా చట్టాన్నిరూపొందించి సమగ్ర బిల్లును ఈపార్ల మెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈదిశగా శరవేగంగా కసరత్తులు కొనసాగుతున్నాయి.