టిఆర్ ఎస్ ప్లీన‌రీ ప్రారంభం, కేసిఆర్ అసంతృప్తి

TRS 17 PLEANERY INAUGARATION
TRS 17 PLEANERY INAUGARATION

హైద‌రాబాద్ః పార్టీకి, ప్రభుత్వానికి నూతనోత్తేజం.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు అంకురార్పణ లక్ష్యాలతో హైదరాబాద్‌లోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ అద్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేశారు. పార్టీకి ఇది 17వ ప్లీనరీ కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాలుగోది. ప్లీనరీ వేదికకు ‘తెలంగాణ ప్రగతి వేదిక’గా నామకరణం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నేడు ప్రారంభమైన ప్లీనరీలో ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభలో వక్తలు మాట్లాడింది ఎవరికీ వినపడని పరిస్థితి నెలకొందని, ఏర్పాట్లు పర్యవేక్షించిన రాజేశ్వర్ రెడ్డిని పిలిచి చెప్పారు. సభా వేదికపైకి వచ్చిన కేసీఆర్ కు ఎవరు ఏం మాట్లాడుతున్నారన్నది వినపడక పోవడంతో, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

TRS PLEANERY ARIEL VIEW
TRS PLEANERY ARIEL VIEW

“రాజేశ్వర్ రెడ్డిగారూ… ఇప్పుడు సారయ్య మాట్లాడింది ఎవరికైనా అర్థం అయిందా? ఆ ఏం లొల్లయ్యా నాకు అర్థం కాదు. బంద్ చేయవయ్యా బాబూ… ఆ సౌండ్ వాళ్లు ఎవళ్లయ్యా బాబూ… సౌండ్ వాళ్లు లేరా? బాలమల్లయ్యా… ఆ ఏసీలు బంద్ చేయించయ్యా బాబూ… ఏం సభ పెట్టిర్రా లేక తమాషా సర్కస్ పెట్టిర్రా? బంద్ చేపిమన్నాకదా? గంట పడతదా దానికి? చెప్పబట్టి పావుగంటైంది కదా? చేపీ… ఏసీలు బంద్ చేపీ. ఏం వినపడతలేదయ్యా బాబూ… తమాషానా? అంత రొద ఉంటే ఎలా వినిపడతది?” అన్నారు.
కాగా, సభా ప్రాంగణంలో హై స్పీడ్ కూలర్లను ఏర్పాటు చేయడంతో వాటి గాలికి ఎవరు ఏం మాట్లాడుతున్నారన్న విషయం వినపడకపోగా కేసీఆర్ ఇలా స్పందించారు. ఆపై తాను మాట్లాడేటప్పుడు ‘ఎకో’ ఎందుకంటూ సౌండ్ ఇంజనీర్ పై మండిపడ్డారు.