గోవాలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌?

Manohar Parikar
Manohar Parikar

పనాజి: గోవాలో ప్రభుత్వ పాలన స్తంభించిపోయిందని, రాజ్యంగ ప్రతిష్టంభన తలెత్తిందని కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు పేర్కొంది. తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వైద్యచికిత్స కోసం అమెరికా వెళ్లడం, మరో ఇద్దరు మంత్రులు కూడా అస్వస్థతకు గురికావడంతో పాలన పూర్తిగా నిలిచిపోయిందని కాంగ్రెస్ పేర్కొంది. గోవా కాంగ్రెస్ నేత రమాకాంత్ ఖలప్ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా ప్రభుత్వ పాలన స్తంభించిపోయిందని, మరో ఇద్దరు మంత్రులు కూడా జబ్బు పడ్డారని ఆయన చెప్పారు. వీరంతా కోలుకోవాలని తాము భగవంతుడిని ప్రార్థిస్తున్నామని, అయితే పాలన స్తంభించిపోవడంతో గోవా ప్రజల నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ఈ పరిస్థితిని తామూ చూస్తూ ఊరుకోలేమని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి పారికర్ గత వారం ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు అట్నించి అటే అమెరికా వెళ్లగా, గోవా విద్యుత్ శాఖ మంత్రి పాండురగం మడ్కైకర్, పట్టణాభివృద్ధి మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిసౌజా వైద్య చికిత్స కోసం గత నెలలో అమెరికా వెళ్లగా, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మడ్కైకర్ జూన్ 5 నుంచి ముంబై ఆసుపత్రిలో వైద్యచికిత్స తీసుకుంటున్నారు.