కోదండరాం ఆగ్రహం

KODANDARAM
KODANDARAM

అడిగిన సీట్లివ్వకుంటే వైదొలుగుదాం
సీట్ల సర్దుబాటుపై జాప్యం టీఆర్‌ఎస్‌కు లాభిస్తుందని ఆందోళన
అవసరమైతే మరో కూటమి ఏర్పాటు చేయాలని ఆలోచన
హైదరాబాద్‌: మహా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై తెలంగాణ జన సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీట్లపై త్వరగా తేల్చాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ తాత్సారం చేస్తున్న కూటమి పెద్దన్న కాంగ్రెస్‌ పార్టీపై టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడిగినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో కూటమి నుంచి వైదొలిగి సొంతంగానే పోటీ చేయాలనే ఆలోచనలో సైతం ఆయన ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ వైఖరిని స్పష్టం చేస్తే వెంటనే తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగుదామని ఆ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో కూటమిలో భాగస్వామ్య పార్టీగా చేరామనీ, అయితే కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలి వల్ల ఆ లక్ష్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కూటమిలో భాగంగా సీట్ల పంపకాలపై టీజేఎస్‌ కోర్‌ కమిటీ సోమవారం సమావేశమై అంతర్గతంగా చర్చించింది. కాంగ్రెస్‌ పార్టీ సాగతీత కారణంగా కూటమి గ్రాఫ్‌ రోజురోజుకూ పడిపోతున్నదన్న ఆందోళన కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న మెజార్టీ శాతం నేతలు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. తమకు కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా క్లారిటీ ఇవ్వకపోవడంతో జన సమితి నేతలలో అసంతృప్తి పెరిగి పొత్తులపై తాడో పేడో తేల్చాలని పార్టీ నేతలు కోదండరాంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పొత్తు అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ త్వరగా తేల్చాలనీ లేకుంటే 15 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళదామని సమితి నేతలు అభిప్రాయపడుతున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. మహా కూటమి పార్టీలు పోటీ చేయాలని అనుకుంటున్న స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించాక మిగతా వాటి విషయంలో చర్చ చేస్తామంటున్న కాంగ్రెస్‌ వైఖరిపై టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సైతం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఉద్యమకారులు, అమరుల ఆకాంక్షలను విస్మరించిన అవినీతి కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నామనీ, తమకు సీట్లు ప్రామాణికం కాదనీ, ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా మహా కూటమితో పొత్తులు కుదుర్చుకున్నామని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పొత్తులో భాగంగా మొదటి నుంచీ మహబూబ్‌నగర్‌, మిర్యాలగూడ, స్టేషన్‌ఘన్‌పూర్‌, ఆలేరు, చెన్నూరు, నిజామాబాద్‌ అర్బన్‌, తాండూరు, ఎల్లారెడ్డి, మహబూబాబాద్‌తో పాటు వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజ్‌గిరి, మెదక్‌, దుబ్బాక, కరీంనగర్‌, ఖానాపూర్‌, అశ్వారావుపేట సీట్లను టీజేఎస్‌కు కేటాయించాలని కోరుతోంది. టీజేఎస్‌ ఆవిర్భావం నుంచి ఈ స్థానాలలో బలోపేతంపై పార్టీ దృష్టి సారించింది. ఈ నియోజకవర్గాలలో ఇంటింటికి జన సమితి పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనికి తోడు స్థానికంగా నెలకొన్న ప్రత్యేక కారణాల వల్ల టీజేఎస్‌ తప్పనిసరిగా గెలుస్తామని భావిస్తామన్న ధీమాతో ఈ నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంది. ఈ స్థానాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజ్‌గిరి, మెదక్‌, దుబ్బాక, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, బెల్లంపల్లి, సిద్దిపేట స్థానాలను టీజేఎస్‌కు ఇస్తామని ప్రతిపాదించింది. అయితే, వీటిలో మిర్యాలగూడ, మెదక్‌, మల్కాజ్‌గిరి వంటి స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తమకే కేటాయించాలని టీజేఎస్‌ పట్టుబడుతోంది. వీటిలో ముఖ్యంగా మిర్యాలగూడ స్థానం నుంచి టీజేఎస్‌ అభ్యర్థి తప్పనిసరిగా విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి తన తనయుడి కోసం టికెట్‌ అడుగుతున్నాడు. జానారెడ్డి ఎలాగూ సిట్టింగ్‌ స్థానమైన నాగార్జునసాగర్‌ నుంచే పోటీ చేస్తారనీ, ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ అన్న కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని కూడా పాటించరా అని టీజేఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, మహా కూటమిలో పొత్తుల అంశం తేలని పక్షంలో ప్రత్యామ్నాయంగా మరో కూటమిని సైతం ఏర్పాటు చేయాలని టీజేఎస్‌ నేతలు కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సీపీఐ, సీపీఎం, బీఎల్‌ఎఫ్‌, తెలంగాణ ఇంటిపార్టీలతో కలిపి మరో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసి కలసికట్టుగా ఎన్నికల బరిలోకి దిగుదామని టీజేఎస్‌ నేతలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది.