కేప్ టౌన్ టెస్టులో బుమ్రాకు చోటిమ్మ‌ని నెహ్రా సూచ‌న‌

Ashish Nehra
Ashish Nehra

న్యూఢిల్లీః కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో బుమ్రాకు అవకాశం కల్పించాలని జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు మాజీ పేస్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం కోహ్లీ సేన ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 5న ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలో నెహ్రా మాట్లాడుతూ..‘తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన బుమ్రాకు కేప్‌టౌన్‌లో జరిగే టెస్టుకు తుది జట్టులో స్థానం కల్పించండి. ఈ టెస్టులో అతన్ని ఆడించడం మనకు దొరికిన మంచి అవకాశం. మరి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు. ఇక్కడి ట్రాక్‌పై అతడు రాణిస్తాడని భావిస్తున్నా. టెస్టులు ఆడిన అనుభవం లేకపోవడంతో ఎక్కువ ఓవర్లు వేసే అవసరం బుమ్రాకు ఇప్పటివరకు రాలేదు అని అనుకోవచ్చు. షమితో పాటు ఇషాంత్‌ బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి తీసుకువస్తాడు. వీరిద్దరే కీలకం. కాబట్టి మూడో పేసర్‌ కోసం బుమ్రా, భువనేశ్వర్‌, ఉమేశ్‌ యాదవ్‌ మధ్య పోటీ నెలకొనడం సహజం’ అని నెహ్రా తెలిపాడు.
‘ఏ జట్టైనా సొంత గడ్డపై అద్భుత ప్రదర్శన చేస్తుంది. ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్‌లోనూ ఆసీస్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలుచుకుంది. అలాగే ఇప్పుడు దక్షిణాఫ్రికాను పరిశీలిస్తే ఇది మంచి బ్యాలెన్స్‌డ్‌ జట్టు. సఫారీ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చాలా ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నారు. ఈ పోరు ఎంత ఆసక్తికరంగా సాగుతున్నదన్న దానిపైనే ఇప్పుడు మనం దృష్టిపెట్టాలి’ అని నెహ్రా అన్నాడు.