కార్తీక మాస పవిత్రత

 

Trikoteswara swamy
Trikoteswara swamy

కార్తీక మాస పవిత్రత

న్మజన్మాంతర పాపాల్ని సైతం దహింపచేసే మాసం కార్తీకమాసం. ఈ మాసం స్నానానికి, దీపానికి, దానానికి ప్రసిద్ధి చెందింది. సుందరమైన, ఆహ్లాదకరమైన శరదృతువ్ఞలో చంద్రుడు పుష్టిమంతుడై తన శీతలకిరణాల ద్వారా సమస్త జీవ్ఞలకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. శివకేశవ్ఞలిద్దరికీ ఈ నెల ప్రీతిపాత్రమైంది కనుక ఈనెలంతా చల్లని నీటి స్నానాలూ, దీపదానాలూ, ఇతర దానాలూ, జపం, ఉప వాసం, వనభోజనం వంటివి చేయాలి. ఈనెలలో శ్రీమహా విష్ణువ్ఞను తులసి, జాజిపూలతోను, మహాదేవ్ఞణ్ని మారేడు దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ పూజించాలని శాస్త్రం చెబుతున్నది.

మహేశ్వరునికి సోమవారం అత్యంతం ప్రీతిపాత్రం కనుక సోమవారాలు ఉపవాసం చేయటం ఎంతో మేలు. కార్తీకమాసంలో వనభోజనాలు చేయాలని శాస్త్రం అంటుంది. రకరకాల చెట్లున్న ప్రాంతంలో ఉసిరిక చెట్టును పూజించి, దానికిందే కూర్చుని పనస ఆకుల విస్తర్లలో భోజనం చేయటం అనాది నుంచి వస్తున్న ఆచారం. కార్తీకమాసం ఆధ్మాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది. మహిమాన్వితమైనది. శివకేశవ్ఞలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసమిది అని ముందే చెప్పుకున్నాం.

ఈరోజు నుండి సూర్యోదయాత్పూర్వమే నదీస్నానం చేయడం శ్రేష్ఠం. నది లభ్యం కాకపోతే లభ్యమైన జలాలతోనే స్నానం చేయాలి. ఈ మాసం ఏ సత్కార్యం చేసినా ”కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని ఆచరించాలని శాస్త్రోక్తి. బుతుపరివర్తనాల వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని, శారీరక, మానసిక, ఆధ్యాత్మికారోగ్యాలకూ, వాటికీ ఉన్న సంబంధాన్ని వైజ్ఞానిక దృష్టితో అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం గల మాసాల్లో కార్తీకమాసమూ ఒకటి. ఈనెలలో నదులు, చెరువ్ఞలు, బావ్ఞల్లో నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారం వల్ల అపూర్వ తేజస్సునూ, బలాన్నీ తెచ్చుకుంటాయి. అందుకనే ఇళ్లలో స్నానాలు వద్దన్నారు

. దైవపూజకు అవసరమైన పుష్పసమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది. అందుకనే దైవసాధనకు ఈ మాసం అత్యుత్తమం. హంసోదక స్నానం ఈ మాసంలోని శరదృతువ్ఞ పవిత్రజలం హంసోదకంగా పిలవబడుతుంది. మానసిక శారీరక రుగ్మతల్ని తొలగించి ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రముఖస్థానం పొందింది. పైత్యప్రకోపాల్ని తగ్గించేందుకే ఈ హంసోదక స్నానం. ఇది అమృతతుల్యంగా మానవాళికి ఉపయుక్తంగా ఉంది. చీకటి ఉండగానే ఉషఃకాల సమయంలో సుమారు పదిహేను నిమిషాల కాలం ఉదరభాగం మునుగునట్లుగా నదిలో స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు సులభంగా నయమవ్ఞతాయి.

శరదృతువ్ఞలో నదీప్రవాహంలో ఓషధుల సారం ఉంటుంది. కృష్ణ యజుర్వేదంలో అప్సుమే సోమోబ్రవీత్‌-అంతర్విశ్వాని భేషజం-అని మంత్రం తెలుపుతున్నది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైనట్టి శరదృతువ్ఞలోని పవిత్రజలాన్ని ‘హంసోదకం అంటార. ఇటువంటి నీరు స్నానపానాదులకు అమృత తుల్యంగా ఉంటుంది అని మహర్షి చరకుని ఉవాచ. ఈ మాసంలో ఉదయం స్నానం చేయడం ప్రశస్తం. అందునా నదీస్నానం మరింత ప్రశస్తం. నదులు ప్రవాహోదకాలు కావడం వల్ల అందులో అనిర్వచనీయమైన విద్యుత్‌ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. కొండల్లో కోనల్లో అడువ్ఞల గుండా పరుగెత్తుకుంటూ వచ్చినప్పుడు అనేక ఔషధాల మీదుగా ప్రవహించడం వల్ల ఓషధీ ప్రభావాన్ని కూడా నదులు సంతరించు కుంటాయి. అందుచేత నదీ జలస్నానం అత్యంత విశేషవంత మయింది.

కార్తీకమాసంలో ఉషఃకాలంలో ఆచరించే స్నానం మంత్రయుక్తంగా ఉండాలి. ”తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావనీ సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగానూ, వాలుగాను తీరానికి పరాన్ముఖంగా స్నానం చేయాలి. కుడిచేతి బొటనవేలితో నీటిని ఆలోఢనం చేసి మూడుదోసిళ్ల నీరు తీరానికి జల్లి తీరం చేరిన తర్వాత కట్టుబట్టలు కొనలను నీరు కారేలా పిండాలి. దీన్ని యక్షతర్పణం అంటారు. అనంతరం పొడివస్త్రాలు ధరించి సంధ్యావందనం చేయాలి.

విష్ణునామ ప్రబంధాని యోగాయేద్విష్ణు సన్నిధౌI గోసహస్ర ప్రదానస్య ఫలమాప్నోతి మానవఃII వాద్యకృత్‌ పురుషశ్చాపివాజపేయ ఫలం లభేత్‌I సర్వతీర్థావగాహోత్థం నర్తకః ఫలమాప్పుయాత్‌II సర్వమేతత్‌ లభేత్పుణ్యం తేషాం తు ద్రవ్యదఃపుమాన్‌ అర్చనాద్దర్మనాద్వాపి తత్‌ షడంశమవాప్నుయాత్‌II ఆ అరుణోదయ సమయంలో విష్ణుసన్నిధిలో విష్ణుకీర్తనలను గానం చేస్తే గొప్ప ఫలితం (వేలగోవ్ఞల దానఫలం) లభిస్తుంది. ఆ కీర్తనలకు వాద్యం వాయించే వానికి వాజపేయ యజ్ఞఫలం, నర్తించేవానికి సర్వతీర్థ స్నానఫలం, అర్చనా ద్రవ్యాలను సమర్పించిన వానికి అన్ని ఫలాలూ, దర్శనాదులు చేసేవారికి వీటిలో ఆరవ వంతు ఫలం లభిస్తుంది.

అరుణోదయ సమయంలో విష్ణ్వాలయంలోగాని, శివాలయంలోగానీ గడపాలి. జాగరం కార్తికే మాసి యః కుర్యాదరుణోదయేI దామోదరాగ్రేసేనానీః గోసహస్రఫలం లభేత్‌II శివ విష్ణు గృహభావే సర్వదేవాలయేష్వపిI కుర్యాదశ్వత్థమూలేషు తులసీనాం వనేష్వపి…అని ధర్మశాస్త్ర వచనం. అరుణోదయ కాలంలో జాగరూకుడై విష్ణు, శివాలయాలలో భగవధ్యానం, స్తోత్రం, జపం చేయడం, వేల గోవ్ఞల్ని దానం చేసిన ఫలాన్నిస్తుంది. శివవిష్ణ్వాలయాలు లభించని పక్షంలో ఏ దేవాలయంలోనైనా, లేదా రావిచెట్టు మొదట్లో గానీ, తులసీ వనంలో గానీ ఉండి భగవత్‌స్మరణ చేయాలి. తడిబట్టలతో దీపారాధన చేయరాదు. ఈ శివకేశవ్ఞలకు ఇష్టమైన మాసంలో స్త్రీలు తులసిచెట్టు ముందు దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. తులసిలో సర్వతీర్థాలున్నాయి.

”యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్‌ అని భక్తితో తులసికి నమస్కరించాలి. సకల పాపాలు హరిస్తాయి. ఈ మాసం కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు. కనుక చంద్రమౌళి అనుగ్రహాన్ని పొందడానికి అభిషేకప్రియుడైన శివ్ఞని ఆరాధించి తరించాలి. కార్తీకంలో దీపదానం ఉత్తమ ఫలాన్నిస్తుంది. తులసి, బిల్వం, (మారేడు) ఉసిరికలయందు, శివాలయంలోను, విష్ణ్వాలయంలోనూ దీపాలు వెలిగించడం పుణ్యప్రదం.

ప్రతిరోజూ ఉభయ సంధ్యలలోనూ, లేదా సాయంసంధ్య వేళ దీపాలు వెలిగించేవారికి దివ్యశుభఫలాలు లభిస్తాయి. ముఖ్యంగా పాడ్యమి, చతుర్థి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమా తిధులు అత్యంత మహిమా న్వితమైనవి. కార్తీకమాసంలో గృహంలోనూ, తులసి సన్నిధిలోనూ, దేవాలయం లోనూ దీపం వెలిగించేవారికి అఖండైశ్వర్యం లభిస్తుందని శాస్త్రవచనం.