కాంగ్రెస్‌ నేతలకు ఎన్నికలంటే భయం!

TALASANI
TALASANI

ఓట్లు తొలగించారంటూ సరికొత్త డ్రామాలు!!
టిడిపి-కాంగ్రెస్‌ పొత్తుతో ఎన్టీఆర ఆత్మ ఘోషిస్తుంది
కేసిఆర్‌ పాలన ప్రజల హృదయాలను తాకింది-వందకు పైగా స్థానాల్లో టిఆర్‌ఎస్‌దే విజయం
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
హైదారాబాద్‌: కాంగ్రెస్‌ నాయకులకు ఎన్నికల భయం పట్టుకుంది, పెద్దఎత్తున ఓట్లను తొలగించారని అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులు సరికొత్త డ్రామాలాడుతున్నారని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ఓట్ల తొలగింపుపై కోర్టునాశ్రయిస్తామని చెబుతూ ఎన్నికలంటేనే వారిలో ఎంతభయం ఉందో చాటుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పైకి మాత్రమ మేకపోతు గాంభీర్యం ప్రదరిస్తున్నారన్నారు. కనీస ఇంగితజ్ఞానం లేకుండా కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు కూతలు కూస్తున్నారని ఆయన మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో గురువారం నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని దేశంలోనే నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణాలోనైతే ఆపార్టీకి ఉనికి కూడా లేదని స్పష్టం చేశారు. ఎవరి ఓట్లైనా జాబితాలో కనిపించకపోతే వారివారి ప్రాంతాల్లో ఎన్‌రోల్‌మెంట్‌ జరుగుతుందని, వారు వెంటనే ఆకేంద్రానికి వెళ్లి క్రాస్‌చెక్‌ చేసుకోవాలని కోరారు. ఆజాబితాలో పేరు కనిపించకపోతే వెంటనే ఓటును నమోదు చేయించకోవచ్చని ఆయన పేర్కొంటూ దీనికి ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. కాగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని, బడ్జెట్‌ అంచనాలకే అందనివిధంగా వాగ్దానాల వర్షం కురిపిస్తూ ప్రజలపే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ కొత్తపార్టీ కాదని, ఆపార్టీలో ఉన్న నాయకులంతా పాత ముఖాలేనని, 50 ఏళ్లు అధికారంలో ఉండి ఏం ఉద్దరించారని ఆయన ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా కేసిఆర్‌ జనహృదయాలను తాకేవిధంగా అద్బుతపాలన సాగిస్తున్నారని, ముందుచూపుతో పథకాలకు రూపకల్పన చేస్తూ వాటిని అమలు చేస్తున్నారని రాష్ట్ర ప్రజలంతా గట్టిగా నమ్ముతున్నారని తలసాని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా, మంచినీటి సరఫరా, ప్రాజెక్టుల నిర్మాణం, గురుకులాల ఏర్పాటు, 40 వేల ఉద్యోగాల నియామకాలు, మరో 57 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం, రైతుబంధు, రైతభీమా, కళ్యాణలక్మీ, షాదీముబారక్‌, హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా తదితర పథకాల అమలు ప్రభుత్వ సాధించిన విజయాలని శ్రీనివాస్‌యాదవ్‌ వివరించారు.
కేవలం 7 స్థానాలు ఉన్న ఎంఐఎంను మతతత్వ పార్టీ అని పదేపదే అంటున్న అమిత్‌షా బిజెపి ఓట్ల కోసం దేశవ్యాప్తంగా మతతత్వ రాజకీయాలు చేస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు. తెలంగాణలో మతం పేరుతో ఓట్లు అడిగితే ప్రజలు తిప్పికొడతారన్నారు. తెలంగాణలో బిసి అవసరం లేదని, తమ ప్రభుత్వమే దేవాలయాలు నిర్మిస్తుందని, యాగాలు చేస్తుందని, అన్నిమతాలను సమానదృష్టితో చూస్తున్నదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అబద్దాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని, ఏ సర్వే ఫలితాలను చూసినా టిఆర్‌ఎస్‌కు 100కు పైగా స్థానాల్లో గెలుస్తుందని వస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో, ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో సెటిలర్లు అనే పదమే ఉండదని, అందరూ తెలంగాణ బిడ్దలేనని మంత్రి పేర్కొంటూ ఓట్ల కోసం సెటిలర్లు అంటూ కాంగ్రెస్‌, టిడిపి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్‌ పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్‌లు సనత్‌నగర్‌ నుంచే ప్రచారం ప్రారంభించి రెండురోజులు అక్కడే ఉన్నా టిడిపి ఒక్క డివిజన్‌లో కూడా గెలువలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆనాడు కాంగ్రెస్‌ డిల్లీ పెద్దలు ఇక్కడ అంజయ్య, పీవి వంటి తెలుగు నేతలను అవమానిస్తున్న తీరును సహించలేకే సినిమా హీరోగా ఎంతో డిమాండ్‌ ఉన్నా పట్టించుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపై స్థాపించారన్నారు. అలాంటి టిడిపి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని ఎన్టీఆర్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, కోదండరామ్‌ పార్టీల కూటమికి..మహాఓటమి మాత్రమే మిగులుతుందని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు.