ఎమ్మెల్సీ రాములు నాయక్‌ సస్పెండ్‌!

Ramulu Naik
Ramulu Naik

కేసిఆర్‌ చుట్టూ గాడ్సేలు ఉన్నారు! -రాములునాయక్‌
హైదరాబాద్‌: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాములునాయక్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు టిఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. కాగా తనను టిఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేసిన అనంతరం రాములునాయక్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసిఆర్‌ ఇప్పటికీ తెలంగాణ గాంధీయే అనిఆయన పేర్కొన్నారు. అయితే కేసిఆర్‌ చుట్టూ గాడ్సేలు ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే తాను భగత్‌సింగ్‌లా తయరయ్యానన్నారు. తనలా పార్టీలో చాలామంది ఉన్నారని, వారంతా త్వరలోనే టిఆర్‌ఎస్‌ నుంచి బయటకు వస్తారని రాములునాయక్‌ ప్రకటించారు. త్వరలో గిరిజన మేధావులతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని రాములునాయక్‌ స్పష్టం చేశారు.
టిఆర్‌ఎస్‌లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా తయారైపోయిందని ఎమ్మెల్సీ రాములునాయక్‌ ఆరోపించారు. తాను గిరిజనుడైనందు వల్లే కనసీం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. గిరిజనులకు రిజర్వేషన్‌ కోరినందుకే తనను పార్టీ నుండి సస్పెండ్‌ చేశారా? అని నిలదీశారు. ప్రగతిభవన్‌లో కేసిఆర్‌ వెంబడి ఉండే తెలంగాణ ద్రోహులు..ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్‌లో ఉన్నారని ఆయన విమర్శించారు. ఒకదశలో ఆయన తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. గిరిజనులకు భూమి ఇస్తామన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు కూడా భూమి ఇవ్వమంటే ఇవ్వట్లేదన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఉద్యమం సమయంలో కేసిఆర్‌ గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీ ఇప్పుడేమైందని రాములునాయక్‌ ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు..తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు..ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మైదాన ప్రాంతంలో ఐటిడిఏలు పెట్టి అభివృద్ది చేస్తామని చెప్పి ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. గిరిజన ఐఏఎస్‌లకు కీలక పదవులు కూడా ఇవ్వలేదన్నారు. గిరిజనులంటే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందనాన్రు. డిఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పారు. డి. శ్రీనివాస్‌, కొండా సురేఖను సస్పెండ్‌ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ..షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్‌ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు గిరిజనులు తగిన బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు బ్యాగ్‌లాగ్‌ ఉద్యోగాలే కాదు 10వ తరగతి పాసైన వేలాదిమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనేదన్నారు. తెలంగాణలో ఈరోజు చూస్తుంటే బాధేస్తోందని..గిరిజన నాయకులు, మేధావులతో చర్చించాకే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.