ఎన్నికల ముగ్గులోకి హిందూ దేవుళ్లు

RAHUL
RAHUL

బిజెపికి రాముడు,కాంగ్రెస్‌కు శివుడు
సమాజ్‌వాదికి మహావిష్ణువు
సార్వత్రిక ఎన్నికలకు పార్టీల మతప్రచారం!
లక్నో: సార్వత్రిక ఎన్నికలకు మతపరమైన భావాలను కూడా రాజకీయపార్టీలు సొమ్ముచేసుకునేందుకు ముమ్మరకసరత్తులుచేస్తున్నాయి.ఎన్నికల్లో రాముడు బిజెపి, కాంగ్రెస్‌కు శివుడు, విష్ణువు సమాజ్‌వాదిపార్టీ అన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌లో సుమారు 22 కోట్లమంది ప్రజలున్నారు. హిందూ దేవుళ్లకు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా ఓట్లుసైతం చీలే అవకాశం ఉందని అంచనా. ఆసక్తికరమైన పరిణామం ఏమంటే ఈసారి బిజెపిపరంగా రాముడు, కాంగ్రెస్‌ పార్టీపరంగాశివుడు అంటే ఈశ్వరుడు, సమాజ్‌వాదిపార్టీపరంగా విష్ణుమూర్తిలను రాజకీయ గోదాలోనికి పార్టీలు దించుతున్నాయి.బహుజన్‌సమాజ్‌ పార్టీ కూడా హిందూదేవుళ్లను ఈ ఎన్నికల బరిలో ప్రచారానికి వాడుకునేందుకు సన్నద్ధం అవుతున్నది. అయితే ప్రత్యేకమైన దేవుడు అనేది లేకుండా హిందూదేవుళ్లపై ప్రచారంచేయాలనినిర్ణయించింది.కేవలం దళితులకు చెందిన పార్టీ అన్న ముద్రను చెరిపివేసుకునేందుకు ఈచర్యలు చేపట్టింది. 2019లో రామజన్మభూమిని మరోసారి తెరపైకి తెచ్చి ఎన్నికల్లో గెలిచేందుకుబిజెపి పావులు కదుపుతోంది. అదేతరహాలో అన్ని పార్టీలు కూడా తమవంతుగా తాము వివిధ దేవుళ్లను ఎన్నికల ప్రచారంలోనికి తెచ్చి లబ్దిపొందాలనుకుంటున్నాయి. ప్రత్యేకించి బిజెపి మతరాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని, అందుకే ప్రతిగా హిందూ వాదాన్ని తాము సైతం ప్రభలంగా వినిపించాలన్న లక్ష్యంతోనే ఈ హిందూప్రచారానికి రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 1990లో వెల్లువెత్తిన హిందూ ప్రభంజనాన్ని తెరపైకి తెచ్చేందుకు బిజెపికోసం మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌లు తమ వంతుప్రయత్నాలుచేస్తూ బిజెపికి సహకరిస్తున్నాయి. రామజన్మభూమి మందిర్‌ వివాదం తారస్థాయికి చేరుకున్న దశలో రామ్‌ నినాదం ఆ పార్టీకి ఎన్నికల్లో మంచి డివిడెండ్లు తెచ్చిపెట్టింది. ముస్లింపార్టీగా ముద్రపడిన కాంగ్రెస్‌కు ఆముద్రచెరిపేసుకునేందు ఇపుడు మతపరమైన రాజకీయాల్లోనికి వస్తోంది. ఇపుడు ఎన్నికల పోస్టర్లలో ఎక్కడ చూసినా ఠాకూర్‌, పండిట్‌, హిందూ హృద§్‌ు సామ్రాట్‌ అన్న నినాదాలతో బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇటీవలికాలంలో అనేక హిందూ దేవుళ్ల మందిరాలకు వెళ్లి ప్రార్థనలు చేసారు. పార్టీకేడర్‌ ఇపుడు రాహుల్‌ను శివభక్తుడన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చాయి. ఇటీవలే కైలాస్‌ మానససరోవర్‌కు రాహుల్‌ యాత్రచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అమేథి పార్లమెంటరీ నియోజకవర్గపర్యటనలో రాహుల్‌కు వందలాది పోస్టర్లు శివభక్త్‌ అన్న నినాదంతో దర్శనమిచ్చాయి. ఈ వారంలో కాంగ్రెస్‌ అధ్యక్షునికి తన పార్టీ కేడర్‌ అలహాబాద్‌లోని బామ్రౌలి ఎయిర్‌పోర్టులో తెలిపిన స్వాగత కార్యక్రమం రాజకీయ చర్చకు తావిచ్చింది. కార్యకర్తలు భంభంభోలే అంటూ నినాదాలిచ్చారు. ఇవే నినాదాలు 2014లో వారణాశికి అప్పటి ప్రధాని అభ్యర్ధిగా మోడీ వచ్చినపుడు బిజెపి కార్యకర్తలు నినాదాలుచేసారు. ఇపుడు తాజాగా ఇటీవలికాలంలో రాహుల్‌గాంధీనికి జైశ్రీరామ్‌ అన్న నినాదాలతో స్వాగతం పలికారు. చిత్రకూట్‌లోని ఒక దేవుని గుడిని సందర్శించినరాహుల్‌కు ఈ నినాదాలు స్వాగతం పలికాయి. బిఎస్‌పి కూడా తన గుర్తును కేవలం ఏనుగు కాదని, గణేశుడని, బ్రహ్మవిష్ణు,మహేశ్వరులకు ప్రతిరూపమని వర్ణిస్తూ ప్రచారంచేసింది. బిఎస్‌పి కేవలం దళితుల పార్టీ అన్న ముద్రను చెరిపేసుకునేందుకు ఈ ప్రచారాన్ని కొత్తగా తెరపైకి తెచ్చింది. దళితులపార్టీ కాదని, సర్వసమాజ్‌ పార్టీ అని విస్తృత స్థాయిలోప్రచారంచేస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సమాజ్‌వాదిపార్టీ ఈ ప్రచారంనుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.ముస్లిం ఓటుబ్యాంకు చేజారకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే హిందూ ఓటుబ్యాంకునుసైతం రాబట్టుకునేందుకు మహావిష్ణువును ప్రచారాస్త్రంగా తెస్తోంది. అంతేకాకుండా తమ పార్టీని ముస్లింలకు మద్దతిచ్చే పార్టీగా ముద్రవేసారని, ఈసారి తాము మరింత అప్రమత్తంగా వ్యవహఱిస్తున్నట్లు ఎస్‌పి నాయకులు చెపుతున్నారు. తన స్వస్థలం సైఫాయిలో మహావిష్ణువు దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఎస్‌పి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ప్రకటించడం తమ పార్టీకూడా తక్కువేమీ కాదన్నట్లు రుజువుచేస్తోంది. అయితే ఎన్నికల్లో ఏదేవుడు ఏపార్టీకి ఎన్ని ఓట్లు తెస్తారన్నది ఓటర్ల నాడినిబట్టి ఉంటుందన్నది సుస్పష్టం. ప్రత్యేకించి చెప్పాలంటే ఎన్నికల సీజన్‌లో దేవుళ్లు కూడా బిజీ అవుతున్నారని రాజకీయ పార్టీల వింతపోకడలు స్పష్టంచేస్తున్నాయి. ఓటర్లను రకరకాలుగా ఊరించి తమవైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ఎవరిస్థాయిలో వారు ప్రయత్నాలుచేస్తున్నారనడానికి ఈ మత ప్రచారమే కీలకం.