ఎన్నికల్లో బ్రహ్మస్తం..ప్రయోగిస్తాం!

Laxman
Laxman

హైదరాబాద్‌ : ఎన్నికల్లో తమ చేతిలో ఒక బ్రహ్మస్తం ఉందని..దాన్ని ప్రయోగిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె. లక్ష్మన్‌ వెల్లడించారు. బిజెపి జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటే..కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీల నాయకులకు దడ పుడుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ద్రోహులతో జతకట్టి మహాకూటమి పేరుతో రాబోతుందని దుయ్యబట్టారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో లక్ష్మన్‌ మాట్లాడారు. తెలంగాణ ద్రోహులతో కోదండరామ్‌ జతకడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన నిధులు..మోడీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి తమ ప్రచార సభల్లో ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికలకు కేసిఆర్‌ ఎందుకు వెళుతున్నారో చెప్పాలని నేటి కరీంనగర్‌ సభ నుంచి నిలదీస్తామన్నారు. కాంగ్రెస్‌ నేతలు పగటి వేశగాళ్లలాగా మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నారన్నారు. ఎన్నికల సందర్బంగా మోడీ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయం మారిపోతుందని లక్ష్మన్‌ ధీమా వ్యక్తం చేశారు. విధి లేక చేతగాక కాంగ్రెస్‌ నేతలు కూటములు కడుతున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే యువజన భారీ ర్యాలికి బిజెపి ముఖ్యమంత్రులు, అమిత్‌షా పాల్గొంటారని లక్ష్మన్‌ పేర్కొన్నారు. అమిత్‌ షా షెడ్యూల్‌ ఇదే…బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా బుధవారం తెలంగాణలో పర్యటిస్తారు. ఆ వివరాలను లక్ష్మన్‌ వివరించారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని అగ్రసేన్‌ మహారాజ్‌ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం కాచిగూడలోని శంబాబా ఆలయం సందర్శించి అక్కడ సాదుసంతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి నేరుగా 12 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పోలింగ్‌బూత్‌ కార్యకర్తలతో అమిత్‌షా సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకోని భోజనం చేస్తారు. తరువాత 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో కరీంనగర్‌లో 3 గంటలకు జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుని నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, శక్తి ప్రతినిధులతో సమావేశం అవుతారు.