ఉత్త‌ర కొరియా చ‌ర్య‌లతో చైనా ఆందోళ‌న‌

north korea and china
north korea and china

బీజింగ్ః ఉత్తర కొరియా చర్యలు చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వ‌రుస క్షిపణి పరీక్షలు, అణు పరీక్షలు నిర్వహించి ప్ర‌పంచాన్ని కూడా సంక‌టంలో పెడుతున్నాయి. ఇటీవల ఉత్తరకొరియా పుంగె-రి కొండల్లోని ఒక సొరంగంలో ఏకంగా హైడ్రోజన్‌ బాంబునే పరీక్షించింది. ఫలితంగా ఆ సొరంగం కూలిపోయి, కొండ బీటలువారింది. ఇక్కడి నుంచి రేడియోధార్మిక వ్యర్థాలు వాతావరణంలో కలుస్తున్నాయని చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది. నూక్లియర్‌ వ్యర్థాలు చైనా వైపు రావడం తథ్యమని.. కానీ వాటిని ఎప్పుడు గుర్తిస్తారనేది ముఖ్యమని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలు ఉత్తరకొరియా పరీక్షించిన హైడ్రోజన్‌ బాంబ్‌ శక్తి అంచనాలకు మించి 250 కిలోటన్నుల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఉత్తరకొరియా సరిహద్దుల్లో వాతవరణంపై ఇప్పటికే దృష్టిపెట్టామని చైనా చెబుతోంది. ఇప్పటి వరకు ఎటువంటి న్యూక్లియర్‌ వ్యర్థాల జాడను కనుగొనలేదని చైనా పర్యావరణ మంత్రి పేర్కొన్నారు. ఈ సారి పుంగె-రి ప్రాంతంలో కనుక ఉత్తర కొరియా మరో అణుపరీక్షను నిర్వహిస్తే చైనా, కొరియాల్లో వేలమంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని అమెరికాకు చెందిన రాన్డ్‌ కార్పొరేషన్‌ అనే రక్షణ వ్యవహారాల విశ్లేషణ సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో పుంగె-రి ప్రాంతంలో అణుపరీక్షలు జరగవన్న ఎటువంటి గ్యారెంటీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో నూక్లియర్‌ లీక్‌లపై చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది.