ఈ దేశంలోని అమ్మాయిలంద‌రికీ మీరు ఆద‌ర్శంః రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్

rajyavardhan singh rathore
rajyavardhan singh rathore

ఢిల్లీః మహిళల యూత్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన బాక్సర్లకు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్‌ నగదు నజరానా ప్రకటించారు. గువాహటిలో నిర్వహించిన పోటీల్లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు కైవసం చేసుకుని బృంద ఛాంపియన్‌షిప్‌ సాధించిన బాక్సర్లు అందరికీ రూ.6.70 లక్షలు బహుమతిగా అందిస్తామన్నారు. విజేతలకు బాక్సింగ్‌ సమాఖ్య ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘అమ్మాయిలు కొన్ని రకాల క్రీడల్లోనే ఆడతారన్న అపోహను మీరు మార్చేశారు. ఎవరైనా ఎందులోనైనా రాణించగలరని నిరూపించారు. ఆడేందుకు, శిక్షణ తీసుకునేందుకు మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఈ దేశంలోని అమ్మాయిలందరికీ మీరు ఆదర్శంగా నిలిచారు. మీ కథలు విన్న అందరూ స్ఫూర్తి పొందుతారు’ అని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న క్రీడా విధానాలను పూర్తిగా మార్చేస్తున్నామని, ప్రతి క్రీడకు సీఈఓ, హై ఫర్ఫార్మెన్స్‌ మేనేజర్లను నియమిస్తామన్నారు. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకాన్ని మరింత మెరుగుపరిచి టోర్నీల్లో, శిక్షణలో రాణించేలా చేస్తామని తెలిపారు. సీఈవోలు ఆటగాళ్లకు అవసరమైన స్పోర్ట్స్‌ సైన్స్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌పై దృష్టిపెడితే హై పెర్ఫార్మెన్స్‌ మేనేజర్లు శిక్షణ, టెక్నిక్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తారని, క్రీడా పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు క్రీడా సమాఖ్యలు తమ వెబ్‌సైట్లలో నిధుల సమీకరణ, ఖర్చుల పద్దులను వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని ఆయ‌న సూచించారు.