ఆనందాల హోలీ

Happy Holy-1
Happy Holy

 

This slideshow requires JavaScript.

ఆనందాల హోలీ

హోలీ పండుగ ముందురోజు రాత్రి కాముడిని దహనం చేయడం ఆనవాయితీ. హోలీపండుగకు ఎంతో విశిష్టత ఉంది. తీవ్రమైన తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడికి ఆటంకం కలిగించి కోరికలు రేకెత్తించడానికి మన్మధుడు ప్రయత్నిస్తుండగా, తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన పరమేశ్వరుడు తన మూడోకన్ను తెరిచి కాముడిని భస్మీపటలం చేసిన రోజు. కామదహనంలో గడ్డితో మన్మధుని బొమ్మను చేసి తగులబెడతారు. సాధారణంగా గ్రామం మధ్యలో సామూహికంగా ఈ కామదహనాన్ని నిర్వహిస్తారు. శైవక్షేత్రాలలో ఈరోజున కామదహనం పేర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శీతాకాలపు చలి తగ్గిపోయి ఇంచుమించు వేసవికాలపు ఎండవేడి ప్రారంభం అయ్యే పర్వం ఇది. కొన్ని ప్రాంతాలకిది వసంతకాలం. భవిష్యోత్తర పురాణం ఈ వివరాలను బాగా చెప్పింది.

ఈరోజున పిల్లలు, పాడిపశువ్ఞల పంటల సంరక్షణకై రాక్షసఘ్న మంత్రం జపిస్తారు. ఆ ఆరుగుణాలు వదిలేయమని కాముడిని పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా విశిష్టత దాగి ఉంది. పరమేశ్వరుడు కాముడిని భస్మం చేయడం ద్వారా సమస్త జనులకు ఒక సందేశాన్ని తెలియజేశాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉండే రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహ, మాయా గుణాలను నాశనం చేసుకుని మనస్సును తమ అదుపులో ఉంచుకోవాలనే ఉపదేశం ఉంది ఇందులో. పరమేశ్వరుడు కామదేవ్ఞడిని భస్మం చేయడంతో శరీరాన్ని కోల్పోయిన కాముడు అదృశ్యరూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడు.

ప్రతి మనిషి తనలోని ఆ ఆరుగుణాలను ప్రజ్వరిల్లకుండా అనునిత్యం అదుపులో ఉంచుకుంటూ మనిషి జన్మను సార్థకం చేసుకోవాలని భగవంతుడు కాముడిని దగ్ధం చేయడం ద్వారా లోకానికి తెలియజేశాడు. ప్రతి మనిషిలో సాధారణంగా ఎన్నో కోరికలు దాగి ఉంటాయి. మానసిక శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా ఆ మనసు చెడువైపు తొందరగా ఆకర్షితమవ్ఞతుంది. కోరికలు ప్రజ్వరిల్లి గుర్రాల్లా స్వారీ చేస్తే మనం కూడా భ్రష్ఠుపట్టిపోతాం. మనలోని రజో, తామస గుణాలను పారదోలి, సాత్వికగుణంతో జీవిస్తేనే మనిషి జన్మకు సార్థకత. మనిషిలో ఉండే కోరికలను దహింపజేసి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనేది ఈ పండుగలోని అంతరార్థం. హోళిక అనే రాక్షసిని తృప్తి పరచేందుకు చేసే ఉత్సవమునే కామదహనమని పిలుస్తారు.

హోళీరోజు ఉదయాన్నే లేచి చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు. ఆ విధంగా చేయడం వల్ల సంవత్సరమంతా సంతోషంగా ఉంటామనే నమ్మకం యావధ్భారతదేశ మంతటా ఉంది. ఈ పండుగనే వసంతోత్సవమని, డోలికోత్స వమని, ఫాల్గుణోత్సవమని పిలుస్తారు. రతీదేవితో పాటు మన్మధుని పూజిస్తే సౌఖ్యాలు కలుగుతాయని, మంచి రూపం, సంతానం లభిస్తాయని భవిష్యత్‌ పురాణంలో చెప్పబడింది. పరమేశ్వరుని మనసును పార్వతిపై మళ్లించాలని మన్మధుడు పూలబాణం వేసేసరికి, అతడిని భస్మం చేస్తాడు ఈశ్వరుడు. రతీదేవి దుఃఖించగా మన్మధుడికి శరీరం లేకున్నప్పటికీ సజీవ్ఞడై ఉండే వరం ఇస్తాడాయన. మన్మథుడంటే కాముడు. ఈ కామదహనం ఫాల్గుణ పౌర్ణమి దినమున జరిగింది.

కనుక ఈరోజును పండుగగా చేసుకోవడం ఆచారమయ్యింది. ఇదేరోజు బెంగాల్‌ రాష్ట్రంలోని వారు కృష్ణుని విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి, ఊపుతూ పూజలు జరుపుతారు. డోలి అంటే ఉయ్యాల. శ్రీకృష్ణుడు మొదటగా ఉయ్యాల ఎక్కినరోజే ‘డోలి పండుగ అయ్యిందని ‘నిర్ణయ సింధువ్ఞలో చెప్పబడింది. హిరణ్యకశిపుని సోదరి హోళిక. మహాశక్తి కలది. అగ్ని కూడా ఆమెను కాల్చలేదట. హరినామస్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదుణ్ణి ఒళ్లో కూర్చొబెట్టుకుని అగ్నిలో ప్రవేశించమని హిరణ్యకశిపుడు హోళికను ఆజ్ఞాపిస్తే ఆమె అలానే చేసింది. అయితే చిత్రంగా హోళిక బూడిదయ్యింది. హరిస్మరణ చేస్తూ ప్రహ్లాదుడు క్షేమంగా బైటికి వచ్చేశాడు.

ఆ సంఘటన గుర్తుగానే హోళీ పండుగన జరుపు కుంటారనేది మరో కథ. ఇలా హోళీ పండుగ వెనుక కథలెన్ని ఉన్నా అందరి మనసుల్ని ఆనందింపజేసే రంగుల పండుగనేది మాత్రం యధార్థం. వసంత బుతువ్ఞ ప్రవేశాన్ని తెలియజేస్తుంది హోళి. ‘కాముని పున్నమి అనే పేరుతో కూడా ఈ ఉత్సవాన్ని జరుపుతారు. ప్రాశస్త్యం శివార్చకులకు, శివారాధకులకు ఫాల్గుణ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు. ఆ రోజు శివభక్తులు అనేక పూజా కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. అదేవిధంగా హోలీపండుగనాడు కామదేవ్ఞని కరుణకై ప్రత్యేక పూజలను ఆరోజు నుంచే ప్రారంభిస్తారు. ఈ పండుగకు మరొక పురాణ గాధ కూడా ఉంది.

దేవతలపై సాధించిన విజయంతో గర్వాంధుడైన హిరణ్యకశిపుడు భగవంతుడిని పూజించవద్దని ప్రజల్ని శాసిస్తాడు. హిరణ్య కశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడు తండ్రి ఆజ్ఞను పాటించకుండా విష్ణుమూర్తిని ఆరాధిస్తాడు. దాంతో ఆగ్రహం చెందిన హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోలికను పిలిచి తన కుమారుడిని మార్చవలసిందిగా సూచిస్తాడు. హోలిక ప్రహ్లాదుడిని పట్టుకుని మంటల్లోకి దూకడంతో ఆమె శక్తులు హరించి భస్మం అయిపోయింది.

ఇంత జరిగినా ప్రహ్లాదుడు క్షేమంగా మంటల్లో నుంచి బయటకు వస్తాడు. హోలిక మరణించడంతో ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవడంతో ఈ పండుగకు ‘హోలీ పండుగ అనే పేరు వచ్చిందని చెబుతారు.హోళికా పూజలో సాయంకాలం స్నానాదికాలు ముగిసిన తర్వాత ”సకుటుంబస్య మమ దుంఢారాక్షసీ పీడా పరిహారార్థం తత్‌ప్రీత్యర్థం చ హోళికా పూజనమహం కరిష్యే అని సంకల్పించి, ఇంటి ముందు ఎండిన కర్రలు, గోమయముతో చేసిన నుగ్గులను రాసిగా పోసి అంటించాలి.

కృతయుగంలో రఘుమహారాజు కాలంలో దుంఢిరాక్షసి పీడ ఈ పౌర్ణమి రోజున విరుగడైందని, అందుకు గుర్తుగా ఈ హోళి మంటలను వేయాలని కథనం. ఈ దుంఢి చిన్నపిల్లలకు పీడాకరమైన దుష్టురాలని చెప్పబడింది. తర్వాత హోళికాదేవతను ఆహ్వానించి, హోళికాయై నమః అనే మంత్రంతో షోడశోపచార పూజ చేయాలి.