అమరావతిలో రూ.140కోట్లతో శ్రీవారి ఆలయం

ANIL KUMAR SIGHAL, TTD EO
ANIL KUMAR SIGHAL, TTD EO

-31న ఆలయ నిర్మాణానికి భూకర్షణ
-ఐదుఎకరాల్లో ఆలయం
-20 ఎకరాల్లో మాస్టర్‌ప్లాన్‌ నిర్మాణాలు
-టిటిడి ఇవో ఏకె సింఘాల్‌
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఐదు ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు టిటిడి కార్యనిర్వాహణాధికారి అనిల్‌కుమార్‌సింఘాల్‌ వెల్లడించారు. సిఆర్‌డిఎ 25 ఎకరాలు స్థలం టిటిడికి కేటాయించిందని తెలిపారు. మిగిలిన 20 ఎకరాల్లో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి ఆధ్యాత్మిక కార్యకలాపాల నిర్వహణ కోసం ఆడిటోరియాలు, కల్యాణమండపాలు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. దాదాపు 140కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టిటిడి ధర్మకర్తలమండలి టెండర్లు ఖరారుచేసినట్లు ఇవో వెల్లడించారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జనవరి 31వతేదీ భూకర్షణం.బీజావాహనం కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లను ముందుగా శుక్రవారం తిరుపతి జెఇవో పోలా భాస్కర్‌, సివిఎస్‌వో గోపీనాధ్‌జెట్టీతో కలసి ఇవో అనిల్‌కుమార్‌సింఘాల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇవో మీడియాతో మాట్లాడుతూ జనవరి 31న ఉదయం 9.15గంటల నుంచి 9.40 గంటల మధ్య భూకర్షణ కార్యక్రమం జరగనుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు రానున్నారని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఆగమశాస్త్రం ప్రకారం భూకర్షణ చేయడం ఆనవాయితీ అని, ఆగమ సలహాదారుల సూచనమేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నారని వివరించారు. శ్రీవారి భక్తుల కోరికమేరకు గత ఏడాది జులైలో కురుక్షేత్రంలో శ్రీవారి ఆలయం నిర్మాణం చేపట్టామని, ఇక్కడ రోజువారీగా వెయ్యినుంచి 2వేలమంది , ఉత్సవాల రోజుల్లో 10వేలనుంచి 15వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారని ఇవో తెలిపారు. జనపవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట,మహాకుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని ఇవో తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టెండర్లు ఖరారుచేశామన్నారు. విశాఖపట్నం,భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలతోబాటు చెన్నైలో శ్రీపద్మావి అమ్మవారి ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ధర్మప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి తిరుమల తరహాలో సంప్రదాయబద్దంగా కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు.
-భూకర్షణంకోసం హోమగుండాలు:
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం భూకర్షణకోసం హోమగుండాలు, వేదిక, సిఆర్‌డిఎ స్టాళ్ళు, ఆలయ నమూనా ఎగ్జిబిషన్‌ , ప్రత్యక్షప్రసారాలు, డిస్‌ప్లే స్క్రీన్లు తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని ఇవో ఎకె సింఘాల్‌ తెలిపారు. భూకర్షణంలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామన్నారు. భూకర్షణం తరువాత 10రోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు ,మిందూ ధర్మప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు చేపడతారని వివరించారు. ఈ తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఇవో చెప్పారు.
-శ్రీవారి సేవకులకు ఆహ్వానం:
శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణంలో భాగంగా ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సూచనలమేరకు శ్రీవారి సేవకులకు,భజనమండళ్ళ సభ్యులను ఆహ్వానిస్తున్నామని ఇవో అనిల్‌కుమార్‌సింఘాల్‌ తెలిపారు. శ్రీవారి సేవకులు పెత్త ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆగమసలహాదారుడు మోహనరంగాచార్యులు, చీఫ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖరరెడ్డి, ఎస్‌ఇ ఎలక్ట్రికల్‌ వెంకటేశ్వర్లు,ఎస్వీబిసి సిఇవో వెంకటనగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.