అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్‌

Dinesh kumar
Dinesh kumar

కోటి 44 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన
19 లక్షల ఇళ్ల నిర్మాణం
ఎన్టీఆర్‌ జలసిరి కింద గిరిజన ప్రాంతాలకు తాగు నీరు
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అధిక నిధులు
వార్తతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌
అమరావతి : రాష్ట్ర విభజన తర్వాత ఎపిలో ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు వల్ల ఆంధ్రప్రదేశ్‌ శీఘ్రగతిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ వెల్లడించారు.రాష్ట్రంలో వచ్చే 15 ఏళ్లలో కోటి 44 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి మొత్తంగా 19 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నదన్నారు.అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు పడ్డాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చొరవ వల్ల ఇటి, పారిశ్రామిక రంగాల్లో సత్వర అభివృద్ది జరుగుతున్నదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల సత్వర అమలుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయని ఈ మేరకు నిధుల వినియోగం దృవపత్రాలను (యుసి) సకాలంలో అందించడం ద్వారా అదనంగా ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఎపికి లభించాయని ఆయన వివరించారు. పనికి ఆహారం పథకం అమలులో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. నరేగా కార్యక్రమాన్ని ఎన్టీఆర్‌ జలసిరితో అనుసంధానం చేసి గిరిజనప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలను పెంపొందించడానికి కార్యక్రమం రూపొందించి అమలు చేసినట్లుగా ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2017 మార్చి 31న పదవీ బాధ్యతలు స్వీకరించిన దినేష్‌ కుమార్‌ ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా అమలు జరిగిన అనేక పథకాల ప్రగతిని ్ఞ్ఞవార్త కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్‌వ్యూలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయని ఆయన అన్నారు. రిజర్వు బ్యాంకు అధికారులతో సంప్రదించి, వారి సమన్వయంతో పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నట్లుగా ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యల పరిష్కారానికి కూడా పలుచర్యలు తీసుకున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9,10 లోని సంస్థల విషయంలో అమరావతికి వాటిని బదలీ చేయించడంలోనూ ఉద్యోగుల బదిలీ, భార్యాభర్తల పరస్పర బదిలీ వ్యవాహారాల్లోనూ ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా కృషి జరిగిందన్నారు.
రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలికవనరుల కల్పనకు అనేక చర్యలకు శ్రీకారం చుట్టినట్లుగా దినేష్‌ కుమార్‌ వివరించారు.వచ్చే 15 ఏళ్లలో కోటి 44 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు చర్యలు ప్రారంభమయ్యాయని, నెల వారీగా ఈ పథకాన్ని సమీక్షించే యంత్రాంగం రూపొందించినట్లుగా ఆయన చెప్పారు.ఈ మేరకు పది లక్షల కోట్ల అంచనాతో కార్యక్రమం రూపొందించామని, ఆర్థికాభివృద్ది, ఉపాది, పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నీతి ఆయోగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న ఎంఒయు వల్ల జరిగే కార్యక్రమం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టడానికి సమర్థవంతంగా తమ ప్రభుత్వం కృషి చేసి విజయం సాధించినట్లుగా ఆయన పలు దృష్టాంతాలను ఉదహరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలుకు హస్తిన నుంచి అధిక నిధులు వచ్చాయని ఢిల్లీలోని ఎపి భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌తో సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు. ఆయా పథకాలను శాస్త్రీయంగా విశ్లేషించి, జాతీయ స్థాయిలో అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి, అవసరమైన యుసిలను సకాలంలో సమర్పించడం ద్వారా అదనంగా గ్రాంట్లు/నిధులు మంజూరయ్యాయని సిఎస్‌ తెలిపారు. కేవలం 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రాయోజితన పథకాల ద్వారా ఈ మేరకు 7,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాన్నారు. రికార్డు స్థాయిలో వచ్చిన ఈ అదనపు నిధులు ఇటీవలి కాలంలో చరిత్రగా మిగులుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను సత్వరంగా అమలు చేయడం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది గ్యారంటీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన తీరుతెన్నులు మంచి ఫలితాలనిచ్చాయన్నారు. పంచాయతీ రాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన సమయంలోనే ఈ నిధుల వినియోగం పై దినేష్‌ పలు ప్రతిపాదనలు రూపొందించి ఒక మార్గాన్ని నిర్ధేశించారు. నరేగా పథకం కింద ఈ మేరకు కేంద్రం నుంచి ఇతర అన్ని రాష్ట్రాల కంటే ఎపి ఎక్కువ నిధులు రాబట్టగలిగింది. దీంతో 1776 గ్రామపంచాయతీలకు కొత్త భవనాలు, 4643 అంగన్‌వాడి కేంద్రాలకు కూడా నూతన భవనాలను ఈ నిధులతో నిర్మించారు.కాగా గ్రామాల్లో 15,000 కిలోమీటర్ల సిసి రోడ్లను నిర్మించారు.పైగా రెండు లక్షల 46 వేల పాండ్లను ఏర్పాటు చేశారు.గ్రామీణ ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యక్తిగతంగా భూమి అభివృద్ధికి, పళ్లతోటల పెంపకానికి తగిన ప్రోత్సహకాలు అందించారు.
గిరిజన సంక్షేమ శాఖ కింద నాలుగున్నర ఏళ్లలో 5,000 పంపుసెట్లను నీటిపారుదల సదుపాయాలు కల్పించేందుకు ఎన్టీఆర్‌ జలసిరి కార్యక్రమం కింద అందించామని దినేష్‌ కుమార్‌ వివరించారు. కాగా రెండో దశలో 7,000 సోలార్‌ పంప్‌ సెట్స్‌ను అందించారు.రాష్ట్రంలో నరేగా, ఎన్టీఆర్‌ జలసిరి, వాటర్‌షెడ్‌, ఎపి మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బీడు ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయి. పళ్లతోటలపెంపకం చేపట్టిన గిరిజనులు, ఇతరులకు ఈ పథకం వల్ల ఆర్థిక పరిపుష్టి పెరగడానికి దోహదం చేసింది. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో పళ్ల మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు భూమిలేని నిరుపేదలకు ఆదాయ వనరు ఏర్పడుతుందని భావించి 26 లక్షల మొక్కలు నాటారు.గ్రామ ప్రజలను కూడా భాగస్వాములను చేసి, మొక్కలు నాటడం,వాటిని పరిరక్షించడం వల్ల 2370 హెక్టార్ల విస్తీర్ణంలో 72 శాతం వరకు అవి పెరిగాయని దినేష్‌ కుమార్‌ వివరించారు. గిరిజన సంక్షేమం కింద సకాలంలో నిధులను ఖర్చుచేయడం వల్ల 95.11 శాతం వరకు నిధుల వినియోగం జరిగిందన్నారు.తాగునీటి కోసం 400 కోట్లు, రవాణా సదుపాయాలకోసం వెయ్యికోట్ల వ్యయం జరిగింది. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వైద్య సేవలను ప్రస్తావిస్తూ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమం వంటి పథకాలు అమలు జరుగుతున్నాయి.చంద్రన్న బీమా పథకం కింద 2 కోట్ల 46 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని,ఈ పథకం పట్ల ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారని ఇప్పటికే 54,664 కుటుంబాలు ఈ పథకం కింద 844 కోట్ల రూపాయల లబ్దిపొందాయన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం భారీయెత్తున జరుగుతున్నదని ఈ మేరకు 5,524 కోట్ల 87 లక్షల వ్యయంతోమొత్తం 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారని దినేష్‌ కుమార్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షలు, పట్టణ ప్రాంతల్లో 6 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నదన్నారు.