కరోనా వైరస్‌పై పెద్దయెత్తున పోరు

china prime minister li keqiang
china prime minister li keqiang

బీజింగ్‌: దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌పై పెద్దయెత్తున పోరు సాగిస్తామని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ ప్రకటించారు. హువై ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంలో విస్తరించిన ఈ వైరస్‌ బారిన పడిన వారిని పరామర్శించేందుకు ఆయన జిన్యింటాన్‌ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయినవారి సంఖ్య 106కు చేరింది. ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో మంగళవారం మరో 24 మంది మరణించినట్లు తెలుస్తోంది. సోమవారం నాడు మరో 1,700 కొత్త ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదు కావటంతో చైనా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,515 కేసులు అధికారికంగా నమోదయినట్లయింది. తాజాగా మరణించిన 24 మందిలో అధికశాతం హువై ప్రావిన్స్‌కు చెందిన వారు కాగా, ఒక పేషెంట్‌ రాజధాని బీజింగ్‌ నగరంలోని ఒక ఆస్పత్రిలో మరణించినట్లు తెలుస్తోంది. ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌పై తాము కృతనిశ్చయంతో పోరాడి విజయం సాధిస్తామని ప్రధాని లీ కెకియాంగ్‌ స్పష్టం చేశారు. ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వారి కోసం నిర్మిస్తున్న కొత్త ఆస్పత్రి నిర్మాణాన్ని కాలంతో పోటీ పడుతూ పూర్తి చేయాలని ఆయన నిర్మాణ కార్మికులను కోరారు. వైరస్‌ వ్యాప్తి నివారణకు ఉధృత స్థాయిలో చర్యలు చేపట్టినట్లు చైనా ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వేగంగా విస్తరిస్తుండటంతో చైనా ప్రభుత్వం కొత్త సంవత్సర సెలవులను ఫిబ్రవరి 2 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/