నేటి నుండి ఏపీలో పెరగనున్న భూముల ధరలు

నేటి నుండి ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. జూన్ ఒకటి నుండి భూముల ధరలను పెంచబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. భూముల ధరల పెంపు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం తో రెండు రోజుల ముందు నుండే ఆ పనిలో ఉన్నారు.

రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఇచ్చే 20శాతం గ్రామాల్లో భూముల ధరలు పెంచాలని నిర్ణయించింది. దాదాపు 30-35శాతం భూముల ధరలు పెరగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా.. గతేడాది భూములు ధరలు పెంచినా అది తక్కువగా ఉంది. భూముల ధరల పెంపుతో స్టాంపు డ్యూటీ పెరగనుంది. దీంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగనుంది.

రాష్ట్రంలో 2020 తర్వాత భూముల మార్కెట్ విలువను పెంచలేదు. స్పెషల్ రివిజన్ పేరుతో ప్రభుత్వం ఇప్పుడు మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధమైంది. గత ఏడాది బాపట్ల, పల్నాడు, గుంటూరులో మార్కెట్ విలువను ఏపీ ప్రభుత్వం పెంచింది. 2022 ఏప్రిల్ లో కొత్త జిల్లా కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంచింది. పాలనా రాజధానిగా చెబుతున్న విశాఖలో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. విశాఖలో భూముల మార్కెట్ విలువ పెంచబోతున్నారని సమాచారం. విశాఖ, గాజువాక, గోపాలపట్నం, ద్వారకానగర్, పెందుర్తి, భీమిలి, మధురవాడ, ఆనందపురం ఏరియాల్లో డిమాండ్‌ను బట్టి ధరలు పెంచుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.