నేటి నుంచి ప్రారంభం కానున్న సాగర్‌- శ్రీశైలం లాంచీ ప్రయాణం

నల్లగొండ: నేటి నుంచి మళ్లీ నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉన్నందుకు ఈ యాత్రకు అనుమతిస్తున్నట్లు పర్యటక సంస్థ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు నాగార్జున సాగర్‌ నుంచి లాంచీ బయలుదేరుతుంది. సాయంత్రం 3 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. మళ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి లాంచీ బయలుదేరి సాయంత్రం 3 గంటలకు నాగార్జున సాగర్‌ చేరుకుంటుంది. కాగా ఈ ఆహ్లాదకర ప్రయాణానికి ఆదివారం సాయంత్రం వరకు 60 టికెట్లు బుక్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు.

టూర్‌ ఛార్జీల వివరాలివే..

సాగర్‌ నుంచి శ్రీశైలానికి ఒకవైపు పెద్దలకు రూ.1,500. పిల్లలకు రూ.1,200. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ వైపు కూడా ఇదే ఛార్జీ వసూలు చేస్తారు. రెండు వైపులా ప్రయాణమైతే పెద్దలకు రూ. 2,500, పిల్లలకు – రూ.2,000 ఛార్జీ తీసుకుంటారు. ఇక హైదరాబాద్‌ నుంచి బస్‌ ప్యాకేజీతో కలిపి పెద్దలకు రూ.3,999, పిల్లలకు రూ.3,399 వసూలు చేయనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/