లాలూకు కిడ్నీ దానం చేయనున్న కుమార్తె రోహిణి..!

కిడ్నీ మార్పిడి చికిత్సను సూచించిన సింగపూర్ వైద్యులు

Lalu Yadav’s Daughter Rohini Acharya To Donate Kidney To Him

పాట్నాః దీర్ఘకాలంగా మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కుమార్తె రూపంలో కొత్త ఊపిరి లభించనుంది. సింగపూర్ లో ఉంటున్న ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ఒక కిడ్నీని తన తండ్రికి ఇచ్చేందుకు సముఖత చూపించినట్టు తెలుస్తోంది. తద్వారా తన తండ్రిని కాపాడుకోవచ్చని ఆమె భావిస్తున్నట్టు సమాచారం.

లాలూ ప్రసాద్ యాదవ్ అక్టోబర్ లో సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సను వారు సూచించారు. దీంతో తన తండ్రికి ఒక మూత్రపిండాన్ని ఇస్తానని కుమార్తె రోహిణి వైద్యులకు తెలిపినట్టు తెలిసింది. దీనికి తొలుత లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించలేదు. కానీ, కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ తీసుకుని మార్పిడి చేయడం వల్ల అధిక సక్సెస్ రేటు ఉంటుందంటూ, రోహిణి తన తండ్రిని ఒప్పించినట్టు తెలిసింది.

ఈ నెల 20-24 మధ్య లాలూ మరోసారి సింగపూర్ కు వెళ్లనున్నారు. ఆ సమయంలో అక్కడ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయనున్నట్టు సమాచారం. లాలూ గత కొన్నేళ్లుగా ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య సేవలు పొందుతున్నారు. కానీ, మూత్రపిండాల మార్పిడి చికిత్సను ఎయిమ్స్ వైద్యులు సూచించలేదు. సింగపూర్ వైద్యులు ఈ సూచన చేయడంతో, అక్కడే చేయించుకునేందుకు మొగ్గు చూపిస్తున్నట్టు తెలిసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/