ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ చేతికి లక్ష్మీ విలాస్‌?

lakshmi vilas bank
lakshmi vilas bank

ముంబై: గత కొద్ది రోజులుగా లాభాల్లో సాగుతున్న ప్రైవేట్‌ రంగ సంస్థ లక్ష్మీవిలాస్‌ బ్యాంకు షేరు మరోసారి ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. ఈ బ్యాంకును ఎన్‌బిఎఫ్‌సి సంస్థ ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విలీనం చేసుకోనున్నట్లు తెలిపింది. ఇందుకు అనుకూలంగా ఈ వారంలో అటు లక్ష్మీవిలాస్‌ బ్యాంకు, ఇటు ఐబి హౌసింగ్‌ ఫైనాన్స్‌ బోర్డులు సమావేశం కానున్నట్లు తెలియచేసింది. దీంతో ఈ అంచనాలతోనే ఈ రెండు షేర్లు వెలుగులో నిలుస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 4 శాతం పెరిగి రూ.92వద్ద ట్రేడవుతోంది. ఈ దారిలోనే ఐబి హౌసింగ్‌ ఫైనాన్స్‌ కూడా 2.2శాతం పెరిగి రూ.917వద్ద ట్రేడవుతోంది. ఇండియా బుల్స్‌ హౌసింగ్‌తో విలీన అంచనాలతో ఇటీవల లక్ష్మీవిలాస బ్యాంకు షేరు జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత ఆరు రోజుల్లో ఈ షేరు 45 శాతం పెరిగింది. కాగా, షేరుకి రూ.72ధరలో గత నెలలో బ్యాంకు ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.460కోట్లు సమీకరించింది. క్విప్‌ ద్వారా సమీకరించిన ఈ నిధులతో కేపిటల్‌ బేస్‌ పటిష్టమైనట్లు బ్యాంకు తెలిపింది.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చెయండి : https://www.vaartha.com/news/business/