ప్రధాని కార్యక్రమానికి కెసిఆర్ దూరంగా ఉండటం సరికాదుః లక్ష్మణ్

రాజకీయాలకు, అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను కెసిఆర్ గుర్తించడం లేదని విమర్శ

k lakshman
k lakshman

హైదరాబాద్ః పార్టీలకు అతీతంగా తమిళనాడు, ఏపీలో ప్రధాని మోడీకి ఆహ్వానం పలుకుతుంటే తెలంగాణలో మాత్రం టిఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదని బిజెపి ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ప్రధాని పాల్గొంటున్న అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. పీఎం పర్యటనకు సీఎం దూరంగా ఉండటం సరి కాదని చెప్పారు. రాజకీయాలకు, అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను కెసిఆర్ గుర్తించడం లేదని అన్నారు. ప్రధాని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాలని కోరారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రధానిని దగ్గరుండి అడగాల్సింది పోయి… కార్యక్రమాలకే దూరంగా ఉండటం కరెక్ట్ కాదని అన్నారు. బిజెపి ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో కూడా మోడీ ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. మోడీ పర్యటనను అడ్డుకుంటామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/