పార్టీ మార్పు పై స్పందించిన ఎల్.రమణ

నేను ఏనాడూ పార్టీ మారాల‌ని అనుకోలేదు.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌

జగిత్యాల: టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న జగిత్యాల‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… తాను ఏనాడూ పార్టీ మారాల‌ని అనుకోలేదని ఎల్‌.ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు. ‘తెలంగాణ‌లోని ఉద్య‌మకారులు, మేధావులు, రాజ‌కీయ ప‌క్షాల నాయ‌కులు నాతో చ‌ర్చించారు. రాజ‌కీయ ఉద్దేశం ఏమిటి? అని, త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏంటి? అంటూ టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు న‌న్ను అడిగారు. అంతేగానీ, వారి పార్టీల్లో చేరాల‌న్న ప్ర‌తిపాద‌న చేయ‌లేదు’ అని ఎల్.ర‌మ‌ణ చెప్పారు.

‘నేను కూడా ఎలాంటి ప్ర‌తిపాద‌న‌తోనూ రాజ‌కీయాలు చేయ‌లేదు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా నాకు బాధ్య‌త‌లు ఇచ్చినందుకు నేను కృత‌జ్ఞ‌త‌తో ఉంటున్నాను. ఎన్టీఆర్ సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్ర‌భావ‌మే ఇప్ప‌టికీ కొన‌సాగుతూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటోంది. తెలుగు దేశం పార్టీ నుంచి ప‌దిసార్లు బీ-ఫారం తీసుకుని పోటీ చేసే అవ‌కాశం నాకు ద‌క్కింది. టీడీపీ ఆరంభం నుంచి నేటి వ‌ర‌కు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నాను’ అని ఎల్.ర‌మ‌ణ చెప్పారు. పదవుల కోసం పాకులాడనని, ఇతరుల పదవులకు అడ్డుపడనని తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసం తన విధానం మార్చుకోనన్నారు. ‘‘చంద్రబాబు నాకు నా కుటుంబానికి ఎంతో చేశారు. టీడీపీ రెక్కల కష్టం నుంచి రమణ ఎదిగాడు… నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు’’ అని రమణ స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/