పురుగులమందు తాగిన అక్బర్ బాషా కుటుంబం

కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి సంచలన సృష్టించిన అక్బర్ కుటుంబం చాగలమర్రిలో ఆత్మహత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇద్దరు కూతుర్లతో సహా అక్బర్‌బాషా దంపతులు పురుగుల మందు తాగారు. దీంతో స్థానికులు నలుగురిని చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు.

ఎర్రబల్లిలోని పొలం తగాదా విషయంలో తమకు న్యాయం జరగడం లేదని గత కొద్దిరోజులుగా అక్బర్‌బాషా కుటుంబం పోరాడుతోంది. ఈ క్రమంలో వారు తమకు న్యాయం చేయాలని కన్నీరు పెడుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో సీఎం కార్యాలయం, కడప ఎస్పీ స్పందించారు. కడప ఎస్పీ అన్బురాజన్‌ నుంచి సీఎం కార్యాలయం వివరాలను సేకరించింది. స్వయంగా సీఎం కార్యాలయం స్పందించడంతో ఈ వివాదానికి ముగింపు పలికిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ క్రమంలో వారు సోమవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అక్బర్‌బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలియగానే చాగలమర్రి, దువ్వూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. అక్బర్‌బాషా కుటుంబానికి ప్రాణాపాయం లేదని తేలినట్లు ఎస్పీ చెప్పారు.