కేసీఆర్‌తో ముగిసిన కుమారస్వామి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ – కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత కుమారస్వామిల భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దసరా కు జాతీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రీసెంట్ గా బీహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్ తో పాటు పలువురి తో సమావేశమయ్యారు.

ఈరోజు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత కుమారస్వామితో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో మూడు గంటల పాటు ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ పోషించాల్సిన పాత్రపై సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ రాజకీయాలపైనా సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి చర్చలు జరిపారు.

ఇరు రాష్ట్రాలతో పాటు కీలకమైన జాతీయ రాజకీయాలపై అర్థమవంతమైన చర్చ జరిగిందని భేటీ అనంతరం కుమారస్వామి పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ కుమారస్వామిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.