వారి పార్టీ సిద్ధాంతాలు ఏమిటో, ప్రాంతీయ పార్టీల పట్ల వారి ఆలోచనలు ఏమిటో ?

బెంగళూరు: ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గల్లంతయిందని… వారి పార్టీ సిద్ధాంతాలు ఏమిటో, ప్రాంతీయ పార్టీల పట్ల వారి ఆలోచనలు ఏమిటో కాంగ్రెస్ స్పష్టం చేయాలని సూచించారు. ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని యూనైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ నుంచి డీఎంకేను పక్కన పెట్టాలని అప్పట్లో కాంగ్రెస్ డిమాండ్ చేసిందని… రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్టీటీఈతో డీఎంకేకు సంబంధాలు ఉన్నాయంటూ అప్పట్లో రచ్చ చేసిందని… ఇప్పుడు అదే డీఎంకేతో కలసి కొనసాగుతోందని విమర్శించారు. యూపీఏ1, యూపీఏ2 ప్రభుత్వాల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ అధికారాన్ని పంచుకుందని చెప్పారు. ఇదెక్కడి సైద్ధాంతిక నిబద్ధత? అని ప్రశ్నించారు.

ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ… బీజేపీని కానీ, ఆరెస్సెస్ ను కానీ ప్రాంతీయ పార్టీలు ఎదుర్కోలేక పోతున్నాయని… దీనికి కారణం సైద్ధాంతిక లోపమేనని అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ లను కాంగ్రెస్ ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ వ్యాఖలకు కౌంటర్ గానే కుమారస్వామి సెటెర్లు వేశారు. ప్రాంతీయ పార్టీల అండతోనే కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారాన్ని అనుభవించిందనే విషయాన్ని రాహుల్ మర్చిపోకూడదని ఎద్దేవా చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/