నేడు హైదరాబాద్ కు మోడీ రాక.. కేటీఆర్ బహిరంగ లేఖ

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దుర్భర పరిస్థితులే మిమ్మల్ని హైదరాబాద్ రప్పించి ఉంటాయన్న కేటీఆర్
తెలంగాణను అవహేళన చేసే మీరు ఈ గడ్డ బాగు కోరుతారని అనుకోనన్న కేటీఆర్

minister-ktr

హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నేడు హైదరాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మోడీ కి బహిరంగ లేఖ రాశారు. నగరానికి వస్తున్న బీజేపీ నాయకులకు మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వం లేని శాంతియుత తెలంగాణ తరపున స్వాగతం.. అంటూ ప్రారంభించిన ఆ లేఖలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సాధించిన ప్రగతిని, రాష్ట్రంలో అమలవుతున్న 450కిపైగా సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలంటూ.. ఆవో (రండి), దేఖో (చూడండి), సీఖో (నేర్చుకోండి) అని పేర్కొన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కారు కొలువైన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దుర్భర పరిస్థితుల కారణంగానే సమావేశాలకు హైదరాబాద్‌ను ఎంచుకుని ఉంటారని, ఈ విషయంలో తనకేమీ ఆశ్చర్యం అనిపించలేదని అన్నారు. విద్వేషం, సంకుచితత్వాన్ని నిలువెల్లా నింపుకున్నందున ప్రజలకు పనికొచ్చే విషయాలను సమావేశాల్లో చర్చిస్తారని ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. మీ చర్చలు మొత్తం కులం, మతం, జాతి ఆధారంగా సమాజాన్ని విభజించే మీ దుర్మార్గపు రాజకీయాల చుట్టూనే సాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అసలు మీ పార్టీ అజెండానే విద్వేషమని, సిద్ధాంతం విభజన అన్న విషయం అందరికీ తెలుసన్నారు.

సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ దూసుకుపోతోందని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తితో అభివృద్ధి అజెండాను చర్చించేందుకు ఈ గడ్డను మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ తెలంగాణ త్యాగాలను చులకన చేసే మీరు ఈ రాష్ట్ర మంచిని కోరుతారని ఎవరూ భావించడం లేదన్నారు. దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్న తెలంగాణ విజయాల అధ్యయనానికి రెండు రోజులు మీకు సరిపోవని తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే రండి, చూడండి, నేర్చుకోండి అని అంటున్నామని మంత్రి వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/