మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్

తెలంగాణ కు భారీ పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇటీవలే యూకే పర్యటన ముగించుకున్న కేటీఆర్.. ఆ తర్వాత అమెరికాలో పర్యటించారు. ఈరోజుతో కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రతిపాదిత పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని అధికారిక ప్రకటన చేసారు.

ఈ సందర్భంగా 80కి పైగా బిజినెస్‌ సమావేశాలు, వివిధ అంశాలపై నిర్వహించిన 5 రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించి తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ఇక్కడి వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పారు. యూకే పర్యటనలో భాగంగా లండన్‌ను సందర్శించిన కేటీఆర్‌, అమెరికాలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్‌, హెండర్సన్‌, బూస్టన్‌ తదితర నగరాల్లో పర్యటించారు. ఆయా చోట్ల దిగ్గజ సంస్థలతో భేటీ అయ్యి.. బీఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సేవలు, బీమా రంగం) ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఐటీ, ఐటీఈఎస్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవేషన్‌, డాటా సెంటర్స్‌, ఆటోమోటివ్‌ అండ్‌ ఈవీ తదితర రంగాలనుంచి పెట్టుబడులను రాష్ర్టానికి తెచ్చేలా కృషి చేశారు.