రేపు య‌శ్వంత్ సిన్హా నామినేషన్ కు కేటీఆర్ హాజరు

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా రేపు సోమవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు త‌న నామినేష‌న్‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బ‌య‌ల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వ‌ర్ రావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంక‌టేశ్ నేత‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి ఉన్నారు.

ఇక ఎన్డీఏ కూట‌మి త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము శుక్రవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ముర్ము నామినేష‌న్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌తిపాదించారు. నామినేష‌న్ ప‌త్రాల‌ను రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు అంద‌జేశారు. నామినేష‌న్ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, గ‌డ్క‌రీ, బీజేపీ రాష్ట్రాల సీఎంలు హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటె రాష్ట్రపతి అభ్యర్థులుగా నిలుచున్నా ఇద్దరు కూడా ఇప్పటికే వివిధ పార్టీల అధినేతలతో తమకు మద్దతు ఇవ్వాలంటూ మాట్లాడారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తనకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ద్రౌప‌ది ముర్ము కు వైస్సార్సీపీ , మాయావతి తదితరులు మద్దుతు తెలుపడం జరిగింది.