బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్

తెలంగాణ మంత్రి కేటీఆర్..బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి సవాల్ విసిరారు. వేములవాడ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ స‌భ‌లో పాల్గొన్న కేటీఆర్..ఈ సందర్బంగా బండి సంజయ్ ఫై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ను తిడితే ఓట్లు రాల‌వు.. ద‌మ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అని సవాల్ విసిరారు. మోడీ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి లేదా.. అడ‌గ‌డానికి నోరు రాదా.. ధ‌ర్మ‌పురి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామికి, కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యానికి, జోగులాంబ ఆల‌యానికి, భ‌ద్రాద్రి రాముడికి, యాదాద్రికి నిధులు తీసుకురా అంటూ సంజయ్ ఫై నిప్పులు చెరిగారు.

రాజన్న గుడిని అభివృద్ధి చేస్తాం.. అది మా బాధ్యత అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉత్త‌ర కాశీకి నిధులు ఇచ్చారు. మ‌రి ద‌క్షిణ కాశీ అయిన వేముల‌వాడ‌కు ఎందుకు నిధులు ఇవ్వ‌రు అని ప్ర‌శ్నించారు. బీజేపీకి అబ‌ద్ధాలు చెప్ప‌డం మాత్ర‌మే తెలుస‌న్నారు. ప‌ల్లె పల్లెనా ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ‌న్నీ ఉన్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే రమేష్ బాబు నేతృత్వంలో వేములవాడ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి మహారాష్ట్రలోని 14 గ్రామాల సర్పంచులు, ప్రజలు తమను తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ ని కోరుతున్నారని తెలిపారు. అలాగే మహబూబ్నగర్ పక్కన ఉన్న కర్ణాటకలోని రాయచూరు ప్రజలు కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారని.. అక్కడి ఎమ్మెల్యే, మంత్రి ముందే మమ్మల్ని కూడా తెలంగాణలో కలపాలని అడుగుతున్నారని గుర్తు చేశారు.