కేంద్ర మంత్రి అమిత్ షా ఫై కేటీఆర్ సెటైర్లు

ktr-satire-on-amit-shah

కేంద్ర మంత్రి అమిత్ షా ఫై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. నిన్న (జూన్ 2) తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఢిల్లీ లో జరిపిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భాంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు తెలంగాణ కోసం పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఆవిర్భవ వేడుకల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల్లో అల్లూరి ఫోటోను చేర్చారు. దీనిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

అల్లూరి సీతారామరాజు ఫొటోను తిలకిస్తున్న అమిత్‌షా… వాట్సాప్‌ యూనివర్సిటీలో కోచింగ్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ అని సెటైర్ వేశారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని పార్టీ బీజేపీ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అబ‌ద్ధాలు, జుమ్లానే వారి డబుల్ ఇంజిన్ అని ఆరోపించారు. అంతే కాదు మంత్రి కిషన్ రెడ్డి ఫై కూడా కేటీఆర్ సెటైర్లు వేశారు.

దేశ స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి పాత్ర‌ను నిజాం ఫ్యామిలీ, నేటి ర‌జాకార్లే ప్ర‌శ్నిస్తున్నార‌ని కిష‌న్‌రెడ్డి ఓ ట్వీట్ చేశారు. భార‌త‌దేశంలోని నిజాం రీజియ‌న్‌లో బ్రిటీష‌ర్ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసేలా గిరిజ‌నుల్లో అల్లూరి సీతారామ‌రాజు చైత‌న్యం తెచ్చార‌ని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణ ఉద్య‌మం-చ‌రిత్ర తెలియ‌ని మంత్రి కిష‌న్‌రెడ్డి అని’ ఎద్దేవా చేశారు. గుజ‌రాతీ గులాముల‌కు తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర తెలుస్తుందా? అని ప్ర‌శ్నించారు. ‘అయ్యో మ‌రిచిపోయాను..తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప‌ద‌వికి రాజీనామా చేయ‌మంటే పారిపోయిన వ్య‌క్తి క‌దా మీరు..’ అంటూ చుర‌క‌లంటించారు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర స‌మ‌రయోధుడ‌ని, తాము ఆయ‌న‌ను గౌర‌విస్తామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టంచేశారు. దీనిపై నెటిజన్లు కూడా మండిప‌డుతున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో అల్లూరి సీతారామరాజు పాల్గొన్నారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.