ప్రీతి ఆత్మహత్య ఫై కేటీఆర్ స్పందన

సీనియర్ వేదింపులు తాళలేక కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫై యావత్ ప్రజా సంఘాలు , విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నిందితుడికి ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా ప్రీతీ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రూ.30 లక్షల ఆర్ధిక సాయం తో పాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉంటె ప్రతిపక్షపార్టీలు ఈ ఘటన ను రాజకీయం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సోమవారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి దురదృష్టావశాత్తూ కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నాం. కొంత మంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ తాము ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే.. వాడు సైఫ్ కావొచ్చు.. సంజయ్ కావొచ్చు.. ఇంకెవడైనా సరే.. వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష వేస్తాం అని కేటీఆర్ అన్నారు.