కేటీఆర్ సార్ …అంటూ రైతు ట్వీట్..క్షణాల్లో రిప్లయ్

టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్..సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ హామీలే కాదు ప్రజల నుండి వచ్చే సమస్యల పట్ల కూడా స్పందిస్తుంటారు. ఆపద లో ఉన్నాం సార్..ఆదుకోండి అని అర్ధరాత్రి ట్వీట్ చేసిన సరే..వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం. తాజాగా ఓ రైతు చేసిన ట్వీట్ కు నిమిషాల వ్యవధిలో స్పందించడమే కాదు అధికారులను అప్రమత్తం చేసారు.

వివరాల్లోకి వెళ్తే..

సదరు రైతు చేసిన ట్వీట్‌లో ‘ కేటీఆర్ గారు.. నమస్కారం సార్ దయచేసి.. నేను పెట్టిన పోస్ట్ చూడాలని ఆశిస్తున్నాను. సమస్య ఏందంటే గత రెండు సంవత్సరాలుగా మా పొలంలో కరెంటు తీగలు పెద్ద లైను కిందికి వచ్చింది సార్. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం గ్రామం పోతారం లైన్మెన్ కి అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. సార్ మీరే మాకు హెల్ప్ చేయాలనీ కోరుకుంటున్నాను సార్ ఇక్కడ లైన్మెన్ కి చెప్పాను పై అధికారులకు చెప్పాను కాని పట్టించుకోవడం లేదు సార్ మీరే హెల్ప్ చేయాలనుకుంటున్నాను సార్’ అంటూ తన మొబైల్ నంబర్ కూడా ప్రస్తావించారు.

రైతు తన సమస్యను చెబుతూ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు (TSNPDCLORGANIZA)వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. కేటీఆర్ కార్యాలయం కూడా సమన్వయం చేస్తుందని తెలిపారు. రైతు కూడా తన సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.