పవన్‌ కల్యాణ్‌కు కెటిఆర్‌ అభినందన

Ktr, Pawan
Ktr, Pawan

పవన్‌ కల్యాణ్‌కు కెటిఆర్‌ అభినందన

హైదరాబాద్‌: జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌కు టిఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అభినందనలు తెలిపారు. ఈ మేరకు బుధవారం పవన్‌కల్యాణ్‌కు కేటీఆర్‌ ఫోన్‌ చేశారు. ఈనెల 16వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ నిర్వహించిన కవాతు విజయవంతం కావడంతో పవన్‌కల్యాణ్‌ను ఆయన అభనందించారు. దీంతో తిరిగి కేటీఆర్‌కు పవన్‌కల్యాణ్‌ కూడా ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు కేటీఆర్‌ తన పార్టీ తరపున ప్రచార పర్వంలో దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడిన రాజకీయ పార్టీలు, వాటికి సంబంధించిన నాయకులపై తీవ్రస్థాయిలో కేటీఆర్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురించి ప్రస్తావిస్తూ ప్రత్యర్థులపై కేటీఆర్‌ సెటైర్లు వేస్తున్నారు. కార్యకర్తలతో ఇటీవల కేటీఆర్‌ మాట్లాడుతూ గడ్డం పెంచిన ప్రతీవోడూ గబ్బర్‌ సింగ్‌ అయితాడా పవన్‌కల్యాణ్‌ అయితాడా అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురించే ఈ సెటైర్‌ వేసిన పేరు ప్రస్తావించకుండా కేటీఆర్‌ పంచ్‌ పడేలా కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పవన్‌కల్యాణ్‌ కూడా గతంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తనయుడు మంత్రి నారా లోకేశ్‌కు కేటీఆర్‌కు మధ్య పోలికల గురించి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనుభవంతో కేటీఆర్‌ తన మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని, మరి లోకేశ్‌కు ఏ అనుభవం ఉందని మంత్రిని చేశారని పవన్‌కల్యాణ్‌ ఇటీవల విమర్శించారు. ఈవిధంగా పవన్‌కల్యాణ్‌, కేటీఆర్‌ల మధ్య సత్‌సంబంధాలు ఉన్నాయని, ఈనేపథ్యంలోనే జనసేన కవాతు విజయవంతం కావడంపై అభినందనలు తెలిపారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.