టెక్‌ మహీంద్రా కార్యాలయంలో 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక విడుదల చేసిన కేటీఆర్

ఐటీ మంత్రి కేటీఆర్ టెక్‌ మహీంద్రా కార్యాలయంలో 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను విడుదల చేసారు. గత ఎనిమిదేళ్లలో ఐటీలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని ఈ సందర్బంగా అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు.

2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ, దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, TSIIC MD వెంకట్రామిరెడ్డి, యూఎస్ కౌన్సిల్ జనరల్ జోయల్ రెఫ్మాన్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మ‌న్‌ జగన్మోహన్ రావు, వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.