అమిత్‌ షా తన పేరును మార్చుకోవాలని కేటీఆర్ సూచన

తుక్కుగూడ లో శనివారం బిజెపి భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభ కు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భాంగా కేసీఆర్ సర్కార్ ఫై అమిత్ షా నిప్పులు చెరిగారు. అయితే అమిత్ షా వ్యాఖ్యల ఫై కేటీఆర్ స్పందించారు. అమిత్ షా తుక్కుగూడ సభలో అన్ని అబద్దాలే చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు ఒక్కో టూరిస్ట్ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతున్నారంటూ సెటైర్లు వేశారు. గాలి మోటార్ లో వచ్చి, గాలి మాటలు చెబుతున్నారని అన్నారు. ఇక్క‌డి ప‌రిస్థితులు వారికి తెలియ‌వని, ఎయిర్‌పోర్టులోనూ, పార్టీ కార్యాల‌యాల్లోనూ చ‌క్క‌గా బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నాయ‌కత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ ను చ‌దువుతున్నారని, దాంట్లో స‌త్యం ఉందా..? అస‌త్యం ఉందా..? అనే విష‌యం తెలుసుకోకుండా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడి తిరిగి వెళ్లిపోతున్నారంటూ మండిపడ్డారు.

అమిత్‌ షా తన పేరును అబద్ధాల బాద్‌షా అని మార్చుకోవాలన్నారు. తెలంగాణకు అక్కరకు వచ్చే ఒక్కమాటను అమిత్‌ షా మాట్లాడలేదన్నారు. ఈ 8 ఏళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలని అడిగామన్న ఆయన.. నిజం చెప్పమని అడిగితే నిజాం గురించి మాట్లాడుతున్నారన్నారు. 8 ఏళ్లుగా కృష్ణా జలాల వివాదాన్ని ఎందుకు పరిష్కరించటం లేదని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఎందుకు ఇవ్వలేదన్నారు. భాజపాకు క్షేత్రస్థాయిలో బలం లేదన్న విషయం ఆ పార్టీ నేతలకు తెలుసన్న కేటీఆర్​.. రూ.2500 కోట్లు ఇస్తే సీఎం పదవి అమ్ముకునేందుకు భాజపా సిద్ధపడిందని ఆరోపించారు.

కర్ణాటకలోని విజయపుర ఎమ్మెల్యేను భాజపా డబ్బు అడిగిందని.. డబ్బుల కోసం పదవులు అమ్ముకునే స్థాయి భాజపాది అని విమర్శించారు. భాజపా నేతలు కర్ణాటకలో మఠాధిపతుల నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటారని ఆరోపించారు. కర్ణాటకలో 40శాతం కమీషన్‌ ఇవ్వలేదని గుత్తేదారును వేధిస్తే… అతను ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.