మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని కేటీఆర్ ప్రకటన

మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా గురువారం మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటించారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని ప్రకటించారు. న‌వంబ‌ర్ 6 త‌ర్వాత ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తానని , అభివృద్ధిలో అండ‌గా ఉంటానని , రోడ్ల‌ను అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. నా మాట మీద విశ్వాసం ఉంచండి. త‌ప్ప‌కుండా అభివృద్ధిలో ప‌య‌నిద్దాం. మునుగోడును అభివృద్ధిలో ముందంజ‌లో ఉంచేందుకు కృషి చేద్దామ‌ని అన్నారు.

మునుగోడు లో ల‌క్షా 13 వేల మందికి రైతుబంధు సాయం అందుతుంది. 10 ఏండ్ల‌కు ముందు మునుగోడు ఎలా ఉండే..? ఇప్పుడు మునుగోడు ఎలా ఉందో? ఆలోచించాలని ప్రజలకు కేటీఆర్ సూచించారు. ఒక‌ప్పుడు రాత్రి స‌మ‌యాల్లో బావుల వ‌ద్ద‌కు వెళ్లి మోటార్లు వేసుకునే వాళ్లం. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్నాం. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా రైతుబీమా అమ‌లు చేస్తున్నాం. గుంట భూమి ఉన్న రైతు చ‌నిపోయినా.. వారం రోజుల్లో రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్నాం. తాగు, సాగునీటితో పాటు క‌రెంట్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నాం. ప్ర‌ధానులు ప‌ట్టించుకోని స‌మ‌స్య‌ను కేసీఆర్ పరిష్కరించారని ఈ సందర్బంగా కేటీఆర్ అన్నారు.