లండ‌న్‌లో బిజీ బిజీగా గడుపుతున్న కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ లండన్ లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ ఈ విదేశీ పర్యటన కొనసాగుతుంది. యునైటెడ్‌ కింగ్‌డం-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మై.. తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వ‌రుసలో ఉంద‌ని ప్రతినిధులకు చెప్పడం జరిగింది. విదేశీ పెట్టుబ‌డుల‌కు తెలంగాణ గ‌మ్య‌స్థానంగా మారింద‌న్నారు. రాష్ట్రంలో స‌మ‌గ్ర‌మైన‌, ప్ర‌గ‌తిశీల ఈవీ పాల‌సీని ప్రారంభించామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ప‌లు ఈవీ కంపెనీలు త‌మ కార్యక‌లాపాల‌ను తెలంగాణ‌లో ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

ఇక ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్‌ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించనున్నారు.