విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కమలాపూర్‌లో రూ.45 కోట్లతో నిర్మించిన మహత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకులాలు, కేజీబీవీ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం పాఠశాలల విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేసి , వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
అంతకు ముందు ఈ కార్య క్రమంలో పాల్గొనేందుకు గాను ప్రత్యేక హెలికాఫ్టర్ లో కరీంనగర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ కు ఏబీవీపీ కార్యకర్తల నుండి నిరసన సెగ ఎదురైంది. కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినా.. నిరసనకారులు మాత్రం ఆయనను అడ్డుకున్నారు. కేటీఆర్ ప్రారంభోత్సవం చేసే గెస్ట్ హౌస్ వద్ద ఆయన కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు రెండుసార్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ జెండాలతో వచ్చిన ఆందోళనకారులు ఆ తర్వాత కాషాయ జెండాలతో నిరసన తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటన పట్ల మంత్రి కేటీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేసారు.