కిటెక్స్ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు భూమిపూజ చేసిన కేటీఆర్

మంత్రి కేటీఆర్ వరంగల్ , హన్మకొండ లలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్‌ భగీరథ ట్యాంక్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.

భూమిపూజ చేసిన సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు. ప‌త్తి పండించే రైతులు మ‌న వ‌ద్ద‌ ల‌క్షల సంఖ్య‌లో ఉన్నార‌ని కేటీఆర్ తెలిపారు. మ‌న ప‌త్తి అత్యుత్త‌మ క్వాలిటీ క‌లిగిన ప‌త్తి అని వ‌స్త్ర వ్యాపార రంగానికి చెందిన పరిశ్ర‌మ‌ల పెద్ద‌లు చెప్పారు. త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, ఆంధ్రాలో పండిన ప‌త్తి కంటే మ‌న ప‌త్తి బాగుంద‌ని చెప్పారు. వేల సంఖ్య‌లో ఉద్యోగాలు సృష్టించేందుకు ఈ పార్కు ఏర్పాటు చేశామ‌న్నారు.

కేసీఆర్ ఆలోచ‌న ఒక్క‌టే.. మ‌న పిల్ల‌లు బాగుండాలి, భ‌విష్య‌త్ త‌రం బాగుండాలి.. వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాలి. మ‌న రైతులు బాగుండాలి. మ‌న మ‌హిళ‌లు బాగుండాల‌నేదే కేసీఆర్ త‌ప‌న అని కేటీఆర్ తెలిపారు. ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని మ‌రింత వేగంగా ముందుకు తీసుకెళ్లాల‌ని కేసీఆర్ తాప‌త్రాయ‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాలు, పొలిటిక‌ల్ టూరిస్టులు వ‌స్త‌రు పోత‌రు. రోజుకు ఒక‌రు వస్తున్న‌రు. నిన్న గాక మొన్న ఒకాయ‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు వ‌చ్చిండు. నిన్న ఒకాయ‌న వ‌రంగ‌ల్‌కు వ‌చ్చిండు.. వాళ్లేదో రాసిస్తే ఆయ‌న చ‌దివి పోయిండు. ఆయ‌న‌కు ఏం తెల్వ‌దు పాపం.. వ‌డ్లు తెల్వ‌దు.. ఎడ్లు తెల్వ‌దు. ఏదో డైలాగ్ కొట్టాలి.. నాలుగు మాట్లాడాలి.. అవ‌త‌ల ప‌డాలి అనేది వారి ప్ర‌ణాళిక అని కేటీఆర్ పంచులు వేశారు.