‘కాక‌తీయ వైభ‌వ స‌ప్తాహం’ కార్యక్రమాల బ్రోచ‌ర్‌ను విడుదల చేసిన కేటీఆర్

జులై 07 నుండి 13 వరకు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలను అట్టహాసంగా జరిపేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ కార్యక్రమాలకు సంబదించిన బ్రోచ‌ర్‌ను ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హ‌రికృష్ణ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పునర్ నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవ‌నం అనే అంశం ప్రధానమైనదని తెలిపారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కాకతీయ పాలనా విధానం ప్రేరణతో ఆనాటి కాకతీయుల గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని తెలిపారు. కాకతీయులు ప్రజల కోసం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేపట్టారని, వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యతని అన్నారు. కాకతీయ పాలనా వైభవం, చారిత్రిక విశిష్టత తెలిపేలా కాకతీయ వైభవ సప్తాహంను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు.

వరంగల్ నగరంలోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌ను మొత్తం విద్యుత్ దీపాలంకరణ చేయాలనీ, నిపుణుల చేత కాకతీయ గొలుసుకట్టు చెరువుల నిర్మాణంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాల‌ని కేటీఆర్ సూచించారు. వందేళ్లకు ఒకసారి ఇలాంటి సందర్భం వస్తుందని కాబట్టి కాకతీయ చరిత్రను భావితరాలకు అందించేలా భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కళాకారులను, కవులను కూడా భాగస్వామ్యం చేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ కవులు కళాకారులను ఈ సందర్భంగా సన్మానించే విధంగా కార్యక్రమం చేపట్టాలని సూచించారు.