ఎస్..కేసీఆర్ కుటుంబ పాలన సాగుతుంది – కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనా కొనసాగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు. తమది ముమ్మాటికీ కుటుంబపాలనే అని , తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులేనని , సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్ద అని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని కేటీఆర్ అన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ , తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అయితుండని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని 4కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని తెలిపారు. 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచాడని చెప్పుకొచ్చారు. ఇలా అన్ని చేస్తూ వస్తున్నాడు కాబట్టే దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని..తమకు కూడా అండగా ఉండమని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు.