యశ్వంత్​ సిన్హాకు మద్దతు ఇవ్వడానికి కారణాలు తెలిపిన కేటీఆర్

విపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ఈరోజు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఉదయం రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి నామినేషన్​ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, టీఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి యశ్వంత్​ సిన్హాకు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ లేకపోయినా తప్పుడు మార్గాల్లో అధికారం పొంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు.

రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని.. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ బీజేపీ తీరును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ.. విపక్షాల అభ్యర్థిని బలపరిచామని ప్రకటించారు. అంబేద్క‌ర్ రాజ్యాంగం అమ‌లు కావ‌డం లేదు.. మోదీ రాజ్యాంగం అమ‌ల‌వుతుంద‌ని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప‌ని చేస్తార‌నే సంపూర్ణ విశ్వాసంతో య‌శ్వంత్ సిన్హా అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు తెలిపామ‌ని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో త‌మ ఎంపీలు, శాస‌న‌స‌భ్యుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ప‌ట్ల వ్య‌క్తిగ‌తంగా మాకు ఇబ్బంది లేదని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆవిడ మంచి వ్య‌క్తే కావొచ్చు. గిరిజ‌న‌, మ‌హిళా అభ్య‌ర్థిని చెప్ప‌డం స‌రికాదు. జ‌న‌వ‌రి 2, 2006లో ఒడిశాలో క‌ళింగ‌న‌గ‌ర్‌లో స్టీల్ ప్లాంట్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న 13 మంది గిరిజ‌నుల‌ను కాల్చిచంపారు. అప్ప‌టి ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామి. ద్రౌప‌ది నాడు మంత్రి కూడా. నాడు ఆమె ఎలాంటి సానుభూతి తెలుప‌లేదు. గిరిజ‌నుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. నిజంగానే గిరిజ‌నుల‌పై ప్రేమ ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన షెడ్యూల్డ్ తెగ‌ల రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచాల‌ని కోరుతున్నాం. ఒక వేళ నిజంగానే గిరిజ‌నుల‌పై ప్రేమ ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు చేసి ఉండాలి. కానీ ఉలుకు ప‌లుకు లేదు. ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ పెడుతామ‌ని పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పారు. ఈ రోజు వ‌ర‌కు అతీగ‌తీ లేదు. తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఏపీలో క‌లిపారు. బీజేపీ వ్య‌వ‌హారం దేశంలోని గిరిజ‌నుల‌కు, తెలంగాణ‌లోని గిరిజ‌నుల‌కు బాగా తెలుసు. చిత్త‌శుద్ధి ఉంటే ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాలి. రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచాలి. ఏడు మండ‌లాల‌ను తిరిగి వెన‌క్కి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.