డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మహానగరంలో డబుల్ డెక్కర్ బస్సు లో ప్రయాణం చేయాలనే నగరవాసుల కోరిక తీరింది. మంగళవారం మూడు డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిజాం కాలం‌లో ప్రారంభ‌మైన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు కాల‌క్ర‌మేణా క‌నుమరుగై పోయాయి. సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబ‌ర్‌తో న‌డిచేవి ఈ బస్సులు నడిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగ‌ర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు నగర రోడ్లపై పరుగులు పెట్టిన ఈ బస్సులు ఆ తర్వాత ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. నిర్వహణ భారం కారణంగా ఆర్టీసీ వీటిని ఒక్కొక్కటిగా సర్వీసు నుంచి తప్పించింది. దీంతో డబుల్ డెక్కర్ బస్సులు చరిత్ర పుటల్లోకి చేరాయి. మళ్లీ ఇన్నాళ్లకు వీటిని తిరిగి హైద్రాబాద్ రోడ్ల ఫై పరుగులు పెట్టించింది టీఎస్ ఆర్టీసీ.

గతంలో మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన మాట మేరకు.. నగరానికి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ తీసుకొచ్చింది. కాగా.. ఈరోజు మూడు డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ కుమార్, ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎస్ శాంతి కుమారి తదితరులు ఉన్నారు. అనంతరం బస్సులో ప్రయాణించి.. జర్నీ ఆస్వాధించారు. ఇక నుంచి ఈ మూడు డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ నగర రోడ్లపై పరుగులు తీయనున్నాయి. మరో మూడు బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులు.. నగరంలోని ప్రముఖ పర్యటక ప్రాంతాల మార్గాల్లో నడపనున్నారు. ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ బస్సులు ఎలా ఉన్నాయంటే..నీలం రంగులో ఈ బస్ కలర్ ఉంది. కింది భాగంలో సీటింగ్ ఉండగా.. ఇందులో పైన కూడా అదనంగా సీటింగ్ ఉంది. పెద్ద పెద్ద అద్దాలతో ఎంతో స్టైలిష్ గా ఉన్నాయి.. కొన్ని బస్సులకు ఓపెన్ టాప్ కూడా ఉంది. నగరంలో ప్రముఖ ప్రాంతాల మధ్య పరుగులు తీయనున్న ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్లు… జర్నీతో పాటు హైదరాబాద్ అందాలను ఆస్వాధించేలా.. బస్సులకు ఓపెన్ టాప్ ఇవ్వటం విశేషం. ఏ ఏ రూట్లలో ప్రయాణిస్తున్నాయన్న వివరాలు ప్రదర్శించేలా పెద్దగా డిస్‌ప్లే కూడా ఉంది. మొత్తం మీద మళ్లీ చాల కాలం తర్వాత డబుల్ డెక్కర్ బస్సులు రావడం తో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.